T20 WC 2024: ‘ప్రపంచకప్‌ జట్టులో యశస్వికి చోటు.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మనే’

21 Nov, 2023 15:29 IST|Sakshi
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఓటమి అనంతరం కోహ్లి, రోహిత్‌ (PC: ICC)

టీమిండియా మాజీ పేసర్‌ జట్టు ఇదే

వన్డే వరల్డ్‌కప్‌-2023 ముగిసి రెండు రోజులు కూడా పూర్తికాకముందే టీమిండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలతో ముందుకువచ్చాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి తన జట్టును ఇప్పుడే ఎంపిక చేసుకున్నాడు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి తన టీమ్‌లో స్థానమిచ్చాడు. వారిద్దరూ కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్‌ ఆడే ఛాన్స్‌ ఉందని శ్రీశాంత్‌ ధీమా వ్యక్తం చేశాడు. కాగా గత కొన్నాళ్లుగా రోహిత్‌, కోహ్లి టీ20 సిరీస్‌లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం సహా.. 2024 ప్రపంచకప్‌ నాటికి యువ జట్టును సిద్ధం చేసే క్రమంలో మేనేజ్‌మెంట్‌ ఈ ఇద్దరు స్టార్లకు విశ్రాంతినిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నవంబరు 19న జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలు కాగా.. ‘విరాహిత్‌’ ద్వయం తీవ్ర నిరాశకు లోనయ్యారు.

కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనుకున్న నమ్మకంతో బరిలోకి దిగిన భారత జట్టు.. అనూహ్య రీతిలో ఆసీస్‌ చేతిలో ఓడిపోవడంతో.. టీ20లలో రోహిత్‌, కోహ్లి భవితవ్యంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేరళ ఫాస్ట్‌బౌలర్‌ శ్రీశాంత్‌ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘రోహిత్‌ శర్మ ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం టీ20 వరల్డ్‌కప్‌లో కూడా రోహిత్‌ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడు. ఎందుకంటే ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన ఘనత అతడి సొంతం.

అయితే, టోర్నీ నాటికి రోహిత్‌ సారథ్యం వహిస్తాడా లేదంటే హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పుతారా అన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇక యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ సైతం పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తే కచ్చితంగా జట్టులోకి వస్తాడు. అయితే మూడో కీపర్‌ ఆప్షన్‌గానే అతడి పేరు ఉంటుంది. 

అయితే, మనకో మ్యాచ్‌ విన్నర్‌ కాబట్టి బ్యాటర్‌గా తనకు స్థానం దక్కడం ఖాయమనిపిస్తోంది. అయితే ఫామ్‌ను బట్టి అతడి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని శ్రీశాంత్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా గతేడాది డిసెంబరులో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్‌ పంత్‌.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌-2024 నాటి అతడు మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్‌-2024 జూన్‌ 4న మొదలుకానుంది.

టీ20 వరల్డ్‌కప్‌-2024కు శ్రీశాంత్‌ ఎంచుకున్న జట్టు:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌

మరిన్ని వార్తలు