ICC Fielding Impact Ratings: 2023 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్‌ అతడే.. లిస్ట్‌లో కోహ్లి, జడ్డూ

21 Nov, 2023 12:35 IST|Sakshi

2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్‌గా ఆసీస్‌ మిడిలార్డర్‌ ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. లబూషేన్‌ 82.66 రేటింగ్‌ పాయింట్లతో ఫీల్డర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో ఆసీస్‌కే చెందిన డేవిడ్‌ వార్నర్‌ ఉన్నాడు. వార్నర్‌ 82.55 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగం టాప్‌-10లో ఇ‍ద్దరు భారత ఆటగాళ్లకు చోటు లభించింది.

72.72 రేటింగ్‌ పాయింట్లతో రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో.. 56.79 రేటింగ్‌ పాయింట్లతో విరాట్‌ కోహ్లి ఆరో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్‌ మిల్లర్‌ మూడో స్థానంలో, నెదర్లాండ్స్‌ ఆటగాడు సైబ్రాండ్‌ ఎంజెల్‌బ్రెచ్‌ ఐదులో, ఎయిడెన్‌ మార్క్రమ్‌, మిచెల్‌ సాంట్నర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వరుసగా 7, 8, 9 స్థానాల్లో నిలిచారు. మైదానంలో కనబర్చిన ప్రతిభ (పరుగుల నియంత్రణ, రనౌట్లు, త్రోలు) ఆధారంగా రేటింగ్‌ పాయింట్లు కేటాయించబడ్డాయి. 

ఇదిలా ఉంటే, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్‌ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ట్రవిస్‌ హెడ్‌ (137).. లబూషేన్‌ (58 నాటౌట్‌) సహకారంతో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (47), విరాట్‌ కోహ్లి (54), కేఎల్‌ రాహుల్‌ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్‌ బౌలర్లు స్టార్క్‌ (3/55), హాజిల్‌వుడ్‌ (2/60), కమిన్స్‌ (2/34), మ్యాక్స్‌వెల్‌ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. 
 

మరిన్ని వార్తలు