జయసూర్య మాయాజాలం.. పసికూనపై ప్రతాపం చూపించిన శ్రీలంక 

5 Feb, 2024 16:24 IST|Sakshi

కొలొంబో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రభాత్‌ జయసూర్య తన స్పిన్‌ మాయాజాలంతో (8/174) ఆఫ్ఘన్ల పని పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జయసూర్య.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో  విజృంభించి ఆఫ్ఘనిస్తాన్‌ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. అషిత ఫెర్నాండో (3/24), విశ్వ ఫెర్నాండో (4/51), ప్రభాత్‌ జయసూర్య (3/67) ధాటికి 198 పరుగులకు కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మత్‌ షా (91) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఏంజెలో మాథ్యూస్‌ (141), చండిమల్‌ (107) సెంచరీలతో కదంతొక్కారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో నవీద్‌ జద్రాన్‌ 4, నిజత్‌ మసూద్‌, కైస్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఆతర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ తొలుత గట్టిగా ప్రతిఘటించింది. ఇబ్రహీం జద్రాన్‌ (114), రహ్మత్‌ షా (54) రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆ జట్టు పటిష్ట స్థితికి చేరేలా కనిపించింది. అయితే జయసూర్య ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.

213 పరుగులకు కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయిన ఆ జట్టు తమ చివరి తొమ్మిది వికెట్లను 83 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. జయసూర్య (5/107), అషిత ఫెర్నాండో (3/63), రజిత (2/59) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది.

56 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. వికెట్‌ కూడా నష్టపోకుండా సునాయాసంగా విజయం సాధించింది. కరుణరత్నే 32, మధుష్క 22 పరుగులతో శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega