IPL 2022 Auction: మెగావేలంలో టాప్‌ లేపిన భారత కుర్రాళ్లు

12 Feb, 2022 15:40 IST|Sakshi

IPL 2022 Auction: ఐపీఎల్‌ మెగావేలం 2022లో ఊహించనట్లుగానే టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. అంచనాలకు మించి ఈ ఆటగాళ్లు మంచి ధరను సొంతం చేసుకున్నారు. నితీష్‌ రాణా, హర్షల్‌ పటేల్‌,  ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా, దేవదూత్‌ పడిక్కల్‌ ఈ జాబితాలో ఉన్నారు. 

హర్షల్‌ పటేల్‌:
గత సీజన్‌లో అంచనాలకు మించి రాణించిన హర్షల్‌ పటేల్‌కు జాక్‌పాట్‌ తగిలింది. 32 వికెట్లతో పర్పుల్‌క్యాప్‌ అందుకున్న హర్షల్‌ను మరోసారి ఆర్‌సీబీ దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన హర్షల్‌ను రూ. 10.75 కోట్లకు ఆర్‌సీబీ మరోసారి దక్కించుకుంది. నవంబర్‌ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ ద్వారా టీమిండియా తరపున  హర్షల్‌ పటేల్‌ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసిన హర్షల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

దేవదూత్‌ పడిక్కల్‌:
టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ దేవదూత్‌ పడిక్కల్‌ దశ తిరిగింది. ఐపీఎల్‌ 2020, 2021 సీజన్లలో ఆర్‌సీబీ తరపున దేవదూత్ పడిక్కల్‌ దుమ్మురేపాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో 473 పరుగులతో ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు గెలుచుకున్న పడిక్కల్‌.. మరుసటి ఏడాది ఐపీఎల్‌ సీజన్లోనూ అదే జోరు చూపెట్టాడు. 411 పరుగులు చేసిన పడిక్కల్‌ సీజన్‌లో వేగవంతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 51 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ సాధించి ఔరా అనిపించాడు.తాజాగా ఐపీఎల్‌ మెగావేలంలో ఆర్‌సీబీ అతని కోసం పోటీపడినప్పటికి చివరికి రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 7.75 కోట్లకు దక్కించుకుంది.

నితీష్‌ రాణా:
గత సీజన్‌లో కేకేఆర్‌ తరపున నితీష్‌ రాణా మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతనిపై నమ్మకముంచిన కేకేఆర్‌ నితీష్‌ రాణాను రూ. 8 కోట్లతో దక్కించుకుంది. కాగా గత సీజన్‌లో కేకేఆర్‌ తరపున 17 మ్యాచ్‌ల్లో 383 పరుగులు చేసిన నితీష్‌ ఖాతాలో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా 2015లో తొలిసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన నితీష్‌ రానా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడని నితీష్‌.. ఆ తర్వాతి సీజన్‌లో 4 మ్యాచ్‌ల్లో 104 పరుగులు చేశాడు. 2017 సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 333 పరుగులతో ఆకట్టుకున్న నితీష్‌ను ముంబై రిలీజ్‌ చేయగా.. 2018 వేలంలో అతన్ని కేకేఆర్‌ దక్కించుకుంది. అప్పటినుంచి నితీష్‌ రాణా కేకేఆర్‌ రెగ్యులర్‌ ప్లేయర్‌గా మారిపోయాడు.

దీపక్‌హుడా:
టీమిండియా ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాను రూ. 5.75 కోట్లకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంది. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీపక్‌ హుడాది మంచి ధరే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 80 మ్యాచ్‌లాడిన దీపక్‌ హుడా 785 పరుగులు చేశాడు. 

మరిన్ని వార్తలు