IND vs SA: మిషన్‌ సౌతాఫ్రికా.. సూర్యకుమార్‌కు బిగ్‌ ఛాలెంజ్‌.. అక్కడే అసలైన మజా!

4 Dec, 2023 16:56 IST|Sakshi

స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్దమవుతోంది. ప్రోటీస్‌ పర్యటనలో భాగంగా తొలుత టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో తలపడనుంది. 

ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ వంటి సీనియర్లు దూరం కావడంతో​ మరోసారి భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు. డిసెంబర్‌10న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఆ నలుగురు వచ్చేసారు..
వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత విశ్రాంతి తీసుకున్న  స్టార్‌ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శుబ్‌మన్‌ గిల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చారు. వీరితో పాటు ఆసీస్‌ సిరీస్‌లో అదరగొట్టిన రింకూ సింగ్‌, యశస్వీ జైశ్వాల్‌ కూడా ప్రోటీస్‌తో టీ20 జట్టులో ఉన్నారు.  వీరితో పాటు యువ వికెట్‌ కీపర్‌ జితేష్‌ శర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఈ సిరీస్‌లో సూర్యకు డిప్యూటీగా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు.

బ్యాటింగ్‌లో అదుర్స్‌..
టీమిండియా బ్యాటింగ్‌ పరంగా బలంగా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో సీనియర్ల బ్యాటర్లు లేని లోటు  అస్సలు కన్పించలేదు. ఈ సిరీస్‌ ఆసాంతం భారత యువ బ్యాటర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా రింకూ సింగ్‌, జైశ్వాల్‌ వంటి వారు తమ బ్యాటింగ్‌ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నారు. ఇప్పుడు శ్రేయస్‌, శుబ్‌మన్‌ గిల్‌ కూడా జట్టులోకి రావడంతో భారత బ్యాటింగ్‌ విభాగం మరింత పటిష్టంగా మారనుంది.

అయితే బౌలింగ్‌లో మాత్రం టీమిండియా కాస్త బలహీనంగా కన్పిస్తోంది. ఆసీస్ సిరీస్‌లో బిష్ణోయ్‌, ముఖేష్‌ మినహా మిగితా ఎవరూ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఆఖరి రెండు టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన అక్షర్‌పటేల్‌కు దక్షిణాఫ్రికా సిరీస్‌ జట్టులో చోటు దక్కలేదు. అయితే కుల్దీప్‌, సిరాజ్‌ వంటి సీనియర్‌ బౌలర్లు జట్టులో రావడం బౌలింగ్‌ విభాగం కూడా మెరుగుపడనుంది.

ప్రోటీస్‌ గడ్డపై మనదే పైచేయి...
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు, వన్డేల్లో భారత్‌కు చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా.. టీ20ల్లో మాత్రం అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ప్రోటీస్‌ జట్టుతో వారి సొంత గడ్డపై ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్‌.. మూడింట విజయం సాధించింది. అంతేకాకుండా 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను కూడా టీమిండియానే సొంతం చేసుకుంది. 

ప్రోటీస్‌ గడ్డపై చివరగా 2017లో భారత్‌ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను 2-1 తేడాతో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్‌గా ఇరు జట్లు ముఖాముఖి టీ20ల్లో 24 సార్లు తలపడగా.. భారత్‌ 13 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికా పదింట గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఎటువంటి ఫలితం తేలలేదు.

ప్రోటీస్‌తో అంత ఈజీ కాదు.. సూర్యకు బిగ్‌ ఛాలెంజ్‌
ఆసీస్‌పై సిరీస్‌ గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా.. ప్రోటీస్‌ గడ్డపై అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే దక్షిణాఫ్రికాతో అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌, క్లాసెన్‌, మిల్లర్‌ వంటి వారు చెలరేగితే భారత బౌలర్లకు తిప్పలు తప్పవు.

అయితే ఈ సిరీస్‌కు వరల్డ్‌క్లాస్‌ పేసర్‌ రబాడ దూరం కావడం కాస్త ఊరటనిచ్చే ఆంశం. వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన  మార్కో జన్సెన్‌,గెరాల్డ్‌ కొయెట్జీ వంటి యువ పేసర్లు మాత్రం జట్టులో ఉన్నారు. అదే విధంగా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ కూడా భారత్‌తో టీ20 సిరీస్‌కు భాగమయ్యాడు. కాబట్టి ప్రోటీస్‌ బౌలర్ల నుంచి కూడా భారత్‌కు గట్టి సవాలు ఎదురు కానుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాలి.

భారత్‌తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్‌ బార్ట్‌మ్యాన్‌, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, డొనొవన్‌ ఫెరియెరా, రీజా హెండ్రిక్స్‌, మార్కో జన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహారాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అండీల్‌ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్‌ షంషి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, లిజాడ్‌ విలియమ్స్‌

భారత టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్ష్దీప్ సింగ్, మహ్మద్‌  సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్
చదవండి: వాళ్ల కంటే బెటర్‌ అని కోహ్లి నిరూపించుకోవాలి.. అప్పుడే ఆ ఛాన్స్‌! రోహిత్‌కు అతడితో పోటీ..

 

>
మరిన్ని వార్తలు