IND VS AUS 5th T20: బెదురులేని క్రికెట్‌ ఆడాలనుకున్నాం.. అదే చేశాం: సూర్యకుమార్‌ యాదవ్‌

4 Dec, 2023 10:51 IST|Sakshi

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (డిసెంబర్‌ 3) జరిగిన నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.  ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్‌ చేసుకుని అద్భుత విజయం​ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 160 పరుగులు చేసిన భారత్‌.. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆసీస్‌ను నిలువరించగలిగింది.

ఆఖరి ఓవర్లో ఆసీస్‌ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో అర్షదీప్‌ సింగ్‌ మ్యాజిక్‌ చేశాడు. 6 బంతుల్లో వికెట్‌ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం​ చేసుకుంది.

మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓవరాల్‌గా ఇది మంచి సిరీస్‌. అందరూ అద్భుతంగా ఆడారు. భారత ఆటగాళ్లు నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు అభినందనీయం. బెదురులేని క్రికెట్‌ ఆడుతూ గేమ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకున్నాం. అదే చేశాం. ఏది కరెక్ట్‌ అనిపిస్తే అదే చేయమని సహచరులకు చెప్పాను. వారు దాన్ని ఫాలో​ అయ్యారు. మొత్తంగా సిరీస్‌ గెలవడం పట్ల సంతోషంగా ఉంది.

ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఉండి ఉంటే యాడ్ ఆన్ అయ్యుండేది. ఈ పిచ్‌పై 200 ప్లస్‌ స్కోర్‌ను ఛేజ్ చేయడం సులభం. మేము తక్కువ స్కోర్‌ చేసి కూడా దాన్ని విజయవంతంగా కాపాడుకోగలిగాం. 10 ఓవర్ల తర్వాత మేము ఆటలో ఉన్నామని సహచరులకు చెప్పాను. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా అర్షదీప్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 

>
మరిన్ని వార్తలు