Shaheen Afridi: అఫ్రిది యార్కర్‌ దెబ్బ.. ఆస్పత్రి పాలైన ఆఫ్గన్‌ ఓపెనర్‌

19 Oct, 2022 12:35 IST|Sakshi

పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది యార్కర్‌ దెబ్బకు అఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ ఆస్పత్రి పాలయ్యాడు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా అప్గానిస్తాన్‌, పాకిస్తాన్‌ మధ్య బుధవారం వార్మప్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ స్టార్‌ షాహిన్‌ అఫ్రిది ఆఫ్గన్‌ బ్యాటర్లకు తన బౌలింగ్‌ పవర్‌ చూపించాడు. మ్యాచ్‌లో రహమనుల్లా గుర్బాజ్‌, హజరతుల్లా జజైయ్‌ల రూపంలో రెండు వికెట్లు తీసి దెబ్బతీశాడు. అయితే రహమనుల్లాను యార్కర్‌ డెలివరీతో ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాడు.

అఫ్రిది వేసిన యార్కర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ కాలికి బలంగా తగిలింది.దీంతో నొప్పితో విలవిల్లాడిన గుర్బాజ్‌ మైదానంలోనే ఫిజియోతో మసాజ్‌ చేయించుకున్నాడు. అయినప్పటికి నడవలేని స్థితిలో ఉన్న గుర్బాజ్‌ను సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు తన వీపుపై గుర్బాజ్‌ను ఎక్కించుకొని పెవిలియన్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఎక్స్‌రే నిమిత్తం గుర్బాజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అయితే గాయం తీవ్రత ఎంత అనేది రిపోర్ట్స్‌ వచ్చాకే తెలియనుంది.

ఒకవేళ గుర్బాజ్‌ గాయంతో దూరమైతే ఆఫ్గనిస్తాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక షాహిన్‌ అఫ్రిది వేసిన యార్కర్‌పై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. టీమిండియాతో మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొనే అఫ్రిది పదునైన యార్కర్‌తో హెచ్చరికలు పంపాడంటూ కామెంట్‌ చేశారు. ఇక గాయంతో ఆసియా కప్‌కు దూరమైన షాహిన్‌ అఫ్రిది టీమిండియాతో మ్యాచ్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం షాహిన్‌ అఫ్రిదియే. ఆ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌ను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేర్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక అఫ్గానిస్తాన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ వార్షార్పణం అయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అప్గానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్‌ మహ్మద్‌ నబీ 51 పరుగులతో రాణించగా.. ఇబ్రహీం జర్దన్‌ 35 పరుగులు, ఆఖర్లో ఉస్మాన్‌ ఘనీ 32 పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 2.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఈ దశలో ఆటకు వర్షం అంతరాయం కలిగించడం.. ఎంతకు తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

చదవండి: గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్‌ శర్మ వంతు?!

'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం'

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం

Poll
Loading...
మరిన్ని వార్తలు