Suryakumar Yadav: '360 డిగ్రీస్‌' రహస్యం చెప్పేసిన సూర్యకుమార్‌

8 Nov, 2022 19:32 IST|Sakshi

టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ కనబరుస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మినహా ప్రతీ మ్యాచ్‌లోనూ తన విలువైన ఆటను చూపిస్తూ దూకుడే మంత్రంగా కొనసాగుతున్నాడు. ఇక సూపర్‌-12 దశలో జింబాబ్వేతో ఆడిన లీగ్‌ మ్యాచ్‌లో సూర్య ఆడిన స్కూప్‌ షాట్లు, 360 డిగ్రీస్‌ షాట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. గ్రౌండ్‌కు నలువైపులా బాదుతూ ''మిస్టర్‌ 360 Degrees'' అనే పదాన్ని సార్థకం చేసుకున్నాడు. 

ఈ విజయంతో గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా గురువారం(నవంబర్‌ 10న) ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. ఇంగ్లండ్‌పై కూడా సూర్యకుమార్‌ అదే జోరును కనబరచాలని గట్టిగా కోరుకుందాం.

ఈ విషయం పక్కనబెడితే.. తన స్కూప్‌ షాట్ల వెనుక ఉన్న రహస్యం ఏంటో సూర్యకుమార్‌ రివీల్‌ చేశాడు.బీసీసీఐ టీవీలో అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన షాట్ల వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. చిన్నప్పుడు రబ్బర్‌‌ బాల్‌‌తో ఆడేటప్పుడే స్కూప్‌‌ షాట్లు కొట్టడంలో మాస్టర్‌‌ అయ్యానని సూర్య తెలిపాడు.

''ఇలాంటి షాట్లు ఆడేప్పుడు బౌలర్‌‌ ఎలాంటి బాల్‌‌ వేస్తున్నాడో, తను ఏం ఆలోచిస్తున్నాడో పసిగట్టాలి. ఫీల్డర్లు ఎక్కడున్నారు.. బౌండరీ లైన్‌‌ ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి.  ఆసీస్‌‌లో గ్రౌండ్స్‌‌ 80–85 మీటర్లు ఉంటాయి. స్క్వేర్‌‌ బౌండ్రీ కూడా 75–80 మీటర్ల దూరం ఉంటుంది. అదే వికెట్ల వెనకాల అయితే 60–65 మీటర్లే ఉంటుంది. కాబట్టి నేను ఆ దిశగానే షాట్లు ట్రై చేసి సక్సెస్‌‌ అవుతున్నా.

చిన్నప్పుడు నేను రబ్బర్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌ ఆడేవాడిని. నా స్నేహితుడు తడి బంతితో 17–-18 గజాల నుంచి ఫాస్ట్‌‌గా బౌలింగ్‌‌ చేసేవాడు. అప్పుడే ఈ షాట్లు ఆడటం నేర్చుకున్నాను. అంతే తప్ప వీటి కోసం స్పెషల్‌‌గా నెట్స్‌‌లో ప్రాక్టీస్‌‌ చేయను. ఇవి 360 డిగ్రీల్లో కొట్టడం నాకు అడ్వాంటేజ్‌గా ‍మారింది'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Ben Stokes: 'సూర్య అద్భుతం.. కోహ్లిని చూస్తే భయమేస్తోంది'

మరిన్ని వార్తలు