WC 2023: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ ఒక్క గండం గట్టెక్కితే! వరల్డ్‌ రికార్డు మనదే

30 Oct, 2023 11:29 IST|Sakshi
వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఎదురులేని టీమిండియా

ICC ODI WC 2023: వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సొంతగడ్డపై ఎదురులేని రోహిత్‌ సేన వరుసగా ఆరు విజయాలు నమోదు చేసి సెమీ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.

వరల్డ్‌కప్‌ పదమూడవ ఎడిషన్‌లో చెన్నై వేదికగా తొలుత ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్‌.. ఆ తర్వాతి మ్యాచ్‌లలో అఫ్గనిస్తాన్‌(8 వికెట్లు), పాకిస్తాన్‌(7 వికెట్లు), బంగ్లాదేశ్‌(7 వికెట్లు), న్యూజిలాండ్‌(4 వికెట్లు)పై వరుస విజయాలు సాధించింది.

తాజాగా లక్నోలో ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసి డబుల్‌ హ్యాట్రిక్‌ గెలుపు నమోదు చేసింది. ఆది నుంచి సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ టైటిల్‌ దిశగా ఒక్కో అడుగు వేస్తూ.. పుష్కర కాలం తర్వాత మరోసారి స్వదేశంలో ట్రోఫీని ముద్దాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.

సంపూర్ణ ఆధిపత్యం
వరల్డ్‌ నంబర్‌ 1గా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న టీమిండియా.. ఇదే జోరును కొనసాగిస్తూ ఓటమన్నదే లేకుండా ముందుకు సాగి టైటిల్‌ గెలిస్తే సూపర్‌గా ఉంటుంది. తద్వారా 48 ఏళ్ల వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ తర్వాత ఐసీసీ టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన మూడో జట్టుగా రికార్డు సృష్టించే అవకాశం ఉంటుంది. 

A post shared by ICC (@icc)

1975లో విండీస్‌
మొట్టమొదటిసారిగా 1975లో ప్రవేశపెట్టిన వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. నాటి టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో తొలుత శ్రీలంక, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియాలను చిత్తు చేసింది. తర్వాత లండన్‌లోని లార్డ్స్ వేదికగా ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి.. సర్‌ క్లైవ్‌ లాయిడ్‌ బృందం తొలి ట్రోఫీని ముద్దాడింది.

అనంతరం 1979 ప్రపంచకప్‌లోనూ చరిత్ర పునరావృతం చేస్తూ.. ఈవెంట్‌ ఆసాంతం అజేయంగా నిలిచి మరోమారు టైటిల్‌ గెలిచింది. అయితే.. శ్రీలంకతో మ్యాచ్‌ ఓడిపోయే పరిస్థితిలో ఉన్న వేళ వర్షం కరేబియన్‌ జట్టును కాపాడగా.. ఫైనల్‌ వరకూ చేరి లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను 92 పరుగుల తేడాతో మట్టికరిపించింది. వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియా జైత్రయాత్ర
వెస్టిండీస్‌ తర్వాత ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. వన్డే వరల్డ్‌కప్‌-2003లో ఓటమన్నదే ఎరుగని రిక్కీ పాంటింగ్‌ బృందం.. జొహన్నస్‌బర్గ్‌ వేదికగా ఫైనల్లో టీమిండియాను ఓడించింది. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేసింది. 

ఆ వరల్డ్‌ రికార్డు ముంగిట రోహిత్‌ సేన
అదే విధంగా 2007 వరల్డ్‌కప్‌లోనూ హిస్టరీ రిపీట్‌ చేసింది కంగారూ జట్టు.. బార్బడోస్‌లో శ్రీలంకతో తుదిపోరులో డీఎల్‌ఎస్‌ పద్ధతిలో 53 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా రిక్కీ పాంటింగ్‌ వరుసాగా రెండోసారి టైటిల్‌ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. రోహిత్‌ సేన విండీస్‌, ఆసీస్‌ల వరల్డ్‌ రికార్డుకు ఐదడుగుల దూరంలో ఉంది.

అభిమానులను వెంటాడుతున్న​ భయాలు
వన్డే ప్రపంచకప్‌-2023 ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి రోహిత్‌ సేన కష్టాలు పడింది. విరాట్‌ కోహ్లి(85), కేఎల్‌ రాహుల్‌(97- నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా గెలుపు అందుకోగలిగింది.

ఆ తర్వాత దాదాపుగా అన్నీ సునాయాస విజయాలే సాధించినా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్ల వైఫల్యం ప్రభావం చూపింది. అయితే, స్వల్ప లక్ష్యాన్ని కాపాడటంలో భారత బౌలర్లు అద్భుత ఆట తీరు కనబరచడంతో రోహిత్‌ సేనకు ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం దక్కింది.

ఎలాంటి పొరపాట్లు చేయొద్దు
లేదంటే.. పరిస్థితి మరోలా ఉండేది. సెమీస్‌ రేసులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దూసుకువస్తున్న వేళ.. టీమిండియా ఎలాంటి పొరపాట్లకు తావిచ్చినా మూల్యం చెల్లించే పరిస్థితులు రావొచ్చు. 

ఇదిలా ఉంటే.. ఏ విషయంలోనైనా అన్నీ సాఫీగా సాగిపోతే అందరికీ ఆనందమే.. అయితే, ఒక్కోసారి అంతా సవ్యంగా జరుగుతున్నట్లు అనినిపించినా అసలు సమయం వచ్చేసరికి మొత్తం కథ మారిపోతుందేమోననే(Law of averages) భయం ఉంటుంది.

లీగ్‌ దశలోనే జరిగిపోవాలి
టీమిండియా అభిమానులు ప్రస్తుతం అదే ఆందోళనలో ఉన్నారు. భారత్‌ వరుసగా ఆరు విజయాలు గెలవడం సంతోషంగా ఉన్నా.. దురదృష్టవశాత్తూ దీనికి(వరుస విజయాలకు) ఎక్కడో ఓ చోట చెక్‌ పడాల్సి వస్తే అది లీగ్‌ దశలోనే జరిగిపోవాలని కోరుకుంటున్నారు.

ఇప్పటికే సెమీస్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్న టీమిండియాకు లీగ్‌ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నవంబరు 2న శ్రీలంక, నవంబరు 5న సౌతాఫ్రికా, నవంబరు 12న నెదర్లాండ్స్‌తో రోహిత్‌ సేన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

టీమిండియా కప్పు కొట్టాల్సిందే
వీటిలో సౌతాఫ్రికా బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తుండగా.. లంక, నెదర్లాండ్స్‌ తమదైన రోజున కచ్చితంగా ప్రభావం చూపగలవు. కాబట్టి టీమిండియా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ముందుకు సాగితే ఒకే.. వీటిలో ఒక్కటి ఓడినా పర్లేదు గానీ ఫైనల్‌కు చేరి అక్కడ జయకేతనం ఎగురవేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.  

చదవండి: WC 2023: ఈజీగా గెలుస్తామనుకున్నాం.. ఓడిపోవడానికి కారణం అదే: బట్లర్‌

మరిన్ని వార్తలు