World Cup 2023: భారత్‌- న్యూజిలాండ్‌ సెమీస్‌కు అంపైర్‌లు వీరే.. 2019 వరల్డ్‌కప్‌లో కూడా

13 Nov, 2023 19:25 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్స్‌ సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో నవంబర్‌ 15 ముంబై వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ తాడోపేడో తేల్చుకోనున్నాయి. అనంతరం నవంబర్‌ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

ఈ సెమీఫైనల్స్‌ పోరుకు అంపైర్‌ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌లుగా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్‌ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్‌ అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ విధులు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ నియమించబడ్డాడు.

కాగా ఈ మ్యాచ్‌ రాడ్ టక్కర్‌కు అంపైర్‌గా వందో అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. మరోవైపు వన్డే ప్రపంచకప్‌-2019లో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీఫైనల్లో‌ కూడా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో భారత్‌ ఓటమి పాలైంది.

ఇక ఆసీస్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మీనన్ ఫీల్డ్‌ అంపైర్‌లుగా ఎంపికయ్యారు. థర్డ్ అంపైర్‌గా క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్‌గా మైఖేల్ గోఫ్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా మ్యాచ్ రిఫరీగా జావగల్ శ్రీనాథ్‌ ఉండనున్నారు.
చదవండి: World cup 2023: కివీస్‌తో సెమీస్‌ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

మరిన్ని వార్తలు