World cup 2023: కివీస్‌తో సెమీస్‌ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

13 Nov, 2023 17:45 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 లీగ్‌ స్టేజీలో తొమ్మిది విజయాలతో ఆజేయంగా నిలిచిన ఇప్పుడు సెమీఫైనల్స్‌ సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నవంబర్‌ 15న తొలి సెమీఫైనల్‌లో ముంబై వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది.

లీగ్‌ దశలో ఇప్పటికే న్యూజిలాండ్‌పై విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును సెమీస్‌లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి 2019 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

2019 వరల్డ్‌కప్‌లో కూడా..
కాగా వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడడం ఇది రెండో సారి. 2019లో వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్‌లో టీమిండియా, కివీస్‌ జట్లు తలపడ్డాయి. 2019 వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్‌.. టైటిల్ కచ్చితంగా సాధిస్తుందని అంతా భావించారు. కానీ సెమీఫైనల్లో కివీస్‌ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలై టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. అప్పటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ను భారత బౌలర్లు కేవలం 239 పరుగులకే కట్టడి చేశారు. అయితే న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 211/5 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రిజర్వ్‌డేకు వాయిదా వేశారు. రిజర్వ్‌డే రోజు 211/5 వద్ద ఆటను ప్రారంభించిన అదనంగా మూడు వికెట్లు 28 పరుగులు చేసింది. దీంతో 240 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ముందు న్యూజిలాండ్‌ ఉంచింది. అయితే. కోహ్లి, రోహిత్‌, పంత్‌ ఫామ్‌ చూసి విజయం లాంఛనమే అనుకున్నారు.  కానీ 240 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా టాపర్డర్‌ బ్యాటర్లు రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు.


 అనంతరం దినేష్‌ కార్తీక్‌ కూడా సింగిల్‌ డిజిట్‌కే ఔట్‌ కావడంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇటువంటి క్లిష్ట సమయంలో రిషభ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో  స్కోర్‌ బోర్డు 100 పరుగులు దాటకముందే టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్‌ ధోని అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ  116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విజయానికి 32 పరుగుల అవసరమైన సమయంలో జడేజా(77) ఔటయ్యాడు. అయినప్పటికీ ఫినిషర్‌ ధోని క్రీజులో ఉన్నాడనే నమ్మకం అభిమానులలో ఉంది. కానీ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన సమయంలో ధోనీ అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు.

రెండో పరుగు తీసే క్రమంలో కివీస్‌ ప్లేయర్‌ మార్టిన్‌ గప్తిల్‌ వేసిన డైరెక్ట్‌ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత అభిమానలంతా ఒక్కసారిగా షాక్‌ గురయ్యారు. ధోని రనౌట్‌ అనంతరం టీమండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయి 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో 18 పరుగుల తేడాతో కివీస్‌ చేతిలో భారత్‌ ఓటమి చవిచూసింది. 

వన్డేల్లో హెడ్‌ టూ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 117 వన్డేల్లొ ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత్ 59 సార్లు విజయం సాధించగా.. కివీస్‌ 50  మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక్క మ్యాచ్‌ డ్రా ముగియగా.. మరో 7 మ్యాచ్‌లు ఎటువంటి ఫలితం తేలకుండా రద్దు అయ్యాయి. 59 విజయాల్లో 24 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసి గెలుపొందగా.. 25 సార్లు ఛేజింగ్‌లో భారత్‌ విజయఢంకా మోగించింది.

మరిన్ని వార్తలు