Prasad Vs Aakash Chopra: కేఎల్‌ రాహుల్‌ విషయంలో మాజీల మధ్య తిట్ల పురాణం

22 Feb, 2023 08:18 IST|Sakshi

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పటికి ఆటతీరు మాత్రం రోజురోజుకు మరింత నాసిరకంగా తయారైంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోర ప్రదర్శన కనబరుస్తున్న కేఎల్‌ రాహుల్‌కు వైస్‌ కెప్టెన్సీ పదవి కూడా మూడింది. అతన్ని జట్టులో నుంచి తీసేయాలని పెద​ ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

తాజాగా కేఎల్‌ రాహుల్‌ విషయమై  టీమిండియా మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రాల మధ్య వాడివేడి చర్చ నడుస్తోంది.రాహుల్ విషయంలో వెంకటేశ్ ప్రసాద్ వ్యక్తిగత ఎజెండాతోనే విమర్శలు గుప్పిస్తున్నాడని ఆకాశ్ చోప్రా విమర్శించాడు. దీనికి ట్విటర్ ద్వారా ప్రసాద్ కౌంటర్ వేశాడు. 

టెస్ట్ క్రికెట్ లో అతని ఫామ్ నానాటికి దిగజారుతుండటంపై తీవ్ర విమర్శలు చేశాడు. తుది జట్టులో ఉండే అర్హత అతనికి లేదని స్పష్టం చేశాడు. రాహుల్ లాగా మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ లకు ఎక్కువ అవకాశాలు దక్కలేదనీ అన్నాడు. అయితే దీనిపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో స్పందిస్తూ.. ''ప్రసాద్ తనకు అనుకూలంగా ఉండేలా మయాంక్, ధావన్, గిల్ గణాంకాలను చూపెట్టాడని'' విమర్శించాడు.

ఇది ప్రసాద్ కు అస్సలు రుచించలేదు. ఎప్పుడో పదేళ్ల కిందట రోహిత్ శర్మ గురించి ఆకాశ్ చోప్రా వ్యంగ్యంగా చేసిన ఓ ట్వీట్ ను గుర్తు చేస్తూ అతనిపై ట్విటర్ ద్వారా విమర్శలు గుప్పించాడు. "యూట్యూబ్ లో నా ఫ్రెండ్ ఆకాశ్ చోప్రా ఓ చెత్త వీడియో చేసి నాది వ్యక్తిగత ఎజెండా అని విమర్శిస్తున్నాడు. స్వదేశంలో మయాంక్ సగటు 70 అన్న విషయాన్ని మరచిపోయి తన అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్న వారి అభిప్రాయాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదే వ్యక్తి రోహిత్ కు జట్టులో చోటు వద్దని వాదించాడు" అని ఓ ట్వీట్ లో ప్రసాద్ అన్నాడు.

"నాకు ఏ ప్లేయర్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఎజెండా లేదు. ఇతరులకే అలాంటి ఎజెండాలు ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా వ్యక్తిగత ఎజెండా అనే విమర్శలు సరి కాదు. కేఎల్ రాహుల్ పైనే కాదు ఏ ఇతర ఆటగాడికి నేను వ్యతిరేకం కాదు. అన్యాయమైన టీమ్ ఎంపికనే నేను సవాలు చేస్తున్నాను. సర్ఫరాజ్ అయినా, కుల్దీప్ అయినా మెరిట్ ఆధారంగానే నా గళం వినిపిస్తున్నాను. కానీ ఆకాశ్ దీనిని వ్యక్తిగత ఎజెండా అనడం నిరాశ కలిగించింది" అని ప్రసాద్ అన్నాడు.

ఈ సందర్భంగా 2014లో రోహిత్ శర్మపై ఆకాశ్ చోప్రా చేసిన ఓ వ్యంగ్యమైన ట్వీట్ ను ప్రసాద్ తెరపైకి తెచ్చాడు. "రోహిత్ 24 ఏళ్ల వయసు, 4 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్నప్పుడు అతని గురించి ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్ ఇదీ. రోహిత్ పై తన వ్యంగ్యాన్ని అతడు ఉపయోగించవచ్చు కానీ నేను 8 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న రాహుల్ సరిగా ఆడని సమయంలో మాత్రం విమర్శలు చేయకూడదు. ఇది సరైనదేనా?" అని ప్రసాద్ ప్రశ్నించాడు.

KL Rahul: ఇక భరించలేం.. తొలగించాల్సిందే!

మరిన్ని వార్తలు