Cricket World Cup 2023: వాళ్లకు వాళ్లు తోపులనుకుంటారు.. పాక్‌ మాజీలపై నిప్పులు చెరిగిన షమీ 

22 Nov, 2023 11:18 IST|Sakshi

టీమిండియా పేస్‌ బాద్‌షా మొహమ్మద్‌ షమీ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లపై నిప్పులు చెరిగాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023 సందర్భంగా భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేక బంతులు సమకూర్చిందంటూ వారు చేసిన నిరాధారమైన ఆరోపణలపై మండిపడ్డాడు. పాక్‌ మాజీలు ఇలాంటి విచక్షణారహిత వ్యాఖ్యలు చేయడం  మానుకోవాలని హెచ్చరించాడు. మీకు మీరే తోపులనుకుంటే సరిపోదని చురకలంటించాడు. ఇకనైనా మారండ్రా బాబూ అంటూ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. 

కాగా, 2023 వరల్డ్‌కప్‌లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా పేస్‌ త్రయం ఏకంగా 58 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. మొహమ్మద్‌ షమీ 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి వరల్డ్‌కప్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలువగా.. జస్ప్రీత్‌ బుమ్రా 11 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు, మొహమ్మద్‌ సిరాజ్‌ 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు నేలకూల్చారు. 

భారత పేసర్లు గతంలో ఎన్నడూ లేనట్లుగా చెలరేగడంతో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లలో అక్కసు కట్టలు తెంచుకుంది. భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేకమైన బంతులు సమకూర్చిందంటూ పాక్‌ మాజీ ఆటగాడు హసన్‌ రజా వివాదాస్పద ఆరోపణలు చేశాడు. ప్రత్యేక బంతుల కారణంగానే భారత పేసర్లు చెలరేగిపోయారంటూ మరికొంతమంది పాక్‌ మాజీలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై షమీ తాజాగా స్పందించాడు. ప్యూమా కంపెనీకి సంబంధించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాక్‌  మాజీలపై నిప్పులు చెరిగాడు. పాక్‌ మాజీల నిరాధారమైన ఆరోపణలు బాధించాయని అన్నాడు. 

ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. నాకైతే ఇతరుల సక్సెస్‌ చూసి ఎప్పుడూ ఈర్ష్య కలుగదు. ఇతరుల సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయగలిగినప్పుడే మంచి ప్లేయర్‌ అనిపించుకుంటారు. మనకు ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. నేను ఇదే నమ్ముతానని అన్నాడు. కుట్ర సిద్ధాంతాల పుట్టుకకు పాకిస్తానీల అర్హతే మూలకారణమని తెలిపాడు. పాక్‌ మాజీలు కొందరు తమకు తామే అత్యుత్తమమని భావిస్తున్నారని, ఇతరులెవ్వరూ వారు సాధించించి సాధించలేరని ఫీలవుతారని చురకలంటించాడు.

మరిన్ని వార్తలు