ముష్ఫికర్‌- షకీబ్‌ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్‌- సచిన్‌ రికార్డు బ్రేక్‌! వన్డే ప్రపంచకప్‌ హిస్టరీలోనే..

13 Oct, 2023 17:27 IST|Sakshi
షకీబ్‌ అల్‌ హసన్‌- ముష్ఫికర్‌ రహీం

నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోరెంతంటే?

ICC Cricket World Cup 2023- New Zealand vs Bangladesh: బంగ్లాదేశ్‌ బ్యాటర్లు ముష్ఫికర్‌ రహీం- షకీబ్‌ అల్‌ హసన్‌ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ జోడీ వీరేంద్ర సెహ్వాగ్‌- సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌.. తమ మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్‌(ఎంఏ చిదంబరం స్టేడియం) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

సెంచరీ భాగస్వామ్యంతో..
ఈ క్రమంలో తొలి బంతికే ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ డకౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌ 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ మెహిదీ హసన్‌ మిరాజ్‌ 30 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నజ్ముల్‌ హొసేన్‌ షాంటో(7) పూర్తిగా నిరాశపరిచాడు.

ఇలా 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌, వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీం ఆదుకున్నారు. అద్భుత భాగస్వామ్యంతో బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు బాటలు వేశారు. షకీబ్‌ 51 బంతుల్లో 40 రన్స్‌ తీయగా.. ముష్ఫికర్‌ రహీం 75 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. 

అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేసిన జోడీగా..
ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో అరుదైన భాగస్వామ్య రికార్డు నెలకొల్పారు. ఇద్దరూ కలిపి 19 ఇన్నింగ్స్‌లో 972 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ సాధించారు. తద్వారా సెహ్వాగ్‌- సచిన్‌ల రికార్డును అధిగమించారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌- సచిన్‌ టెండుల్కర్‌ కలిపి 20 ఇన్నింగ్స్‌లో 971 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇక ఈ జాబితాలో 20 ఇన్నింగ్స్‌లో 1220 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా మాజీ స్టార్లు ఆడం గిల్‌క్రిస్ట్‌- మాథ్యూ హెడెన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లా, టీమిండియా జోడీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

మరో రికార్డు.. ఇది సమంగా..
వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక 50+ పార్ట్‌నర్‌షిప్స్‌ నమోదు చేసిన జోడీలు
ఆడం గిల్‌క్రిస్ట్‌- మాథ్యూ హెడెన్‌- 12
వీరేంద్ర సెహ్వాగ్‌- సచిన్‌ టెండుల్కర్‌- 8
ముష్ఫికర్‌ రహీం- షకీబ్‌ అల్‌ హసన్‌- 8.

కాగా కివీస్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు స్కోరు చేసింది.

చదవండి: ‘శార్దూల్‌ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు