#Hardik Pandya: ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. కష్టంగా ఉంది! ట్రోఫీ మాత్రం మనదే!

4 Nov, 2023 12:38 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా

Cricket World Cup 2023- Hardik Pandya Emotional Note: ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. జట్టుకు దూరంగా ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది.  ప్రతి మ్యాచ్‌.. ప్రతి బాల్‌.. ప్రతిచోటా జట్టును చీర్‌ చేస్తూ అక్కడే తిరుగుతూ ఉంటుంది.

కష్టకాలంలో నాపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు.

సెమీస్‌ నాటికి కోలుకుంటాడని భావిస్తే
కాగా పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాండ్యా చీలమండకు గాయమైన విషయం తెలిసిందే. అయితే, జాతీయ క్రికెట్‌ అకాడమీలో బీసీసీఐ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్న ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. సెమీస్‌ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు.

పాండ్యా స్థానంలో ప్రసిద్‌ కృష్ణ
కానీ దురదృష్టవశాత్తూ.. గాయం తీవ్రంగా ఉండటంతో టోర్నీ మధ్యలోనే అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో పాండ్యా స్థానంలో కర్ణాటక బౌలర్‌, టీమిండియా యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చాడు.

ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీకి ఇలా దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు.

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

అయితే, ప్రస్తుత భారత జట్టు ఎంతో ప్రత్యేకమైనదని.. ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందంటూ సహచరులను కొనియాడాడు. స్వదేశంలో టీమిండియా మరోసారి ట్రోఫీ గెలవడం ఖాయమని హార్దిక్‌ పాండ్యా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు.

అజేయంగా నిలిచి సెమీస్‌లో
వన్డే ప్రపంచకప్‌ పదమూడవ ఎడిషన్‌లో రోహిత్‌ సేన ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఏడూ గెలిచింది. చివరగా ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్‌ చేరింది. లీగ్‌ దశలో తదుపరి సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు