WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌

16 Oct, 2023 13:31 IST|Sakshi

ICC WC 2023- Ind vs Pak: ఆటను ఆటలాగే చూడాలి.. న్యాయం ఒక్కొక్కళ్లకు ఒక్కో విధంగా ఉండదు.. ఎదుటివాళ్లపై నిందలు వేసే ముందు.. మనం ఎలాంటి వాళ్లమో! మన వల్ల ఎదుటివాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి!

అంతేతప్ప... అవతలి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడంలో అర్థం ఉండదు.. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు డైరెక్టర్‌ మిక్కీ ఆర్థర్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఇంచుమించు ఇదే రీతిలో కౌంటర్‌ ఇచ్చాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా చరిత్రను పునరావృతం చేస్తూ టీమిండియా పాక్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. జరిగిన దాయాదుల సమరంలో రోహిత్‌ సేన సమిష్టి ప్రదర్శనతో బాబం ఆజం బృందాన్ని 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

అతడు కాస్త భిన్నం
నీలి వర్ణంతో నిండిపోయిన స్టేడియంలో చిరకాల ప్రత్యర్థిపై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుని అభిమానులకు సంతోషం పంచింది. ఇదిలా ఉంటే.. పాక్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మిగతా ఆటగాళ్లకు కాస్త భిన్నంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే.

దీంతో అతడిని ఉద్దేశించి కొంతమంది టీమిండియా ఫ్యాన్స్‌.. రిజ్వాన్‌ రీతిలోనే అతడికి కౌంటర్లు ఇచ్చారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో రిజ్వాన్‌ను ట్రోల్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌కాగా భారత జట్టు అభిమానులపై కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు.

భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటే వినోదం మాత్రమే కాదు
ఇందుకు బదులుగా.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం.. కాబట్టి పరస్పరం కౌంటర్లు విసురుకోవడం సహజమే అని మరికొందరు దీనిని చిన్న విషయంగా కొట్టిపారేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ షమీని పాక్‌ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

వాళ్ల వల్లే ఓడిపోయాం.. అది కూడా ఓ కారణమే
అభిమానుల సంగతి ఇలా ఉంటే.. పాక్‌ టీమ్‌ డైరెక్టర్‌ మిక్కీ ఆర్థర్‌ మాత్రం భారత క్రికెట్‌ నియంత్రణ మండలిపై బురదజల్లే ప్రయత్నం చేశాడు. సొంతగడ్డపై ఏ జట్టుకైనా ప్రేక్షకుల మద్దతు బలంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి.. ఇది ఐసీసీ ఈవెంట్‌లా కాదు బీసీసీఐ ఈవెంట్‌లా అనిపిస్తోందని విమర్శించాడు.

ఇండియా- పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా తాను ఒక్కసారి కూడా దిల్‌ దిల్‌ పాకిస్తాన్‌ అనే మ్యూజిక్‌ వినలేదని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్‌ ఓటమికి ఒక విధంగా టీమిండియాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మద్దతే కారణమని చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు.

పాక్‌ ఆటగాళ్లు స్పందించనే లేదు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా.. టీమిండియా అభిమానులను ట్రోల్‌ చేస్తున్నవాళ్లు, మిక్కీ ఆర్థర్‌కు తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘మిక్కీ ఆర్థర్‌ తప్ప పాకిస్తాన్‌ ఆటగాళ్లెవరూ స్పందించలేదు.

అయినా, కేవలం ఒక్క ఆటగాడి(రిజ్వాన్‌) విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందని అతడు ఆలోచించలేకపోయాడా? మిగతా వాళ్లు చక్కగా తమ పని తాము చేసుకుని వెళ్లిపోయారు కదా! కొంతమంది 20-30 సెకన్ల వీడియోను ఆధారంగా చూపి కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. భారత్ ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉన్న వాళ్లు. 

శ్రీలంక విషయంలో ఎందుకిలా?
సోషల్‌ మీడియాలో చూసేదంతా నిజం కాదు.. సగం సగం వీడియోలతో అసలు నిజాన్ని దాచేసే ప్రయత్నాలు జరుగుతాయి. దిల్‌ దిల్‌ పాకిస్తాన్‌ అనే మ్యూజిక్‌ వినిపించనేలేదని మిక్కీ ఆర్థర్‌ అంటున్నాడు. కొంతమందేమో ప్రేక్షకులు ఇరు జట్లకు మద్దతుగా నిలవాలని సూక్తులు చెబుతున్నారు. మరి శ్రీలంక విషయంలో ఎందుకలా మాట్లాడలేదు?

హైదరాబాద్‌లో జరిగిన దానికి లంక జట్టు కూడా పాక్‌లాగ ఫిర్యాదులు చేయవచ్చు కదా! హైదరాబాద్‌లో జీతేగా భాయ్‌ జీతేగా అని డీజే పెట్టినపుడు.. ప్రేక్షకులంతా పాకిస్తాన్‌ జీతేగా అని పాక్‌ టీమ్‌కు మద్దతు పలికారు. శ్రీలంకకు అసలు సపోర్టు లేదు.

అఫ్గనిస్తాన్‌కు ఢిల్లీ ప్రేక్షకుల మద్దతు
అదే విధంగా ఢిల్లీలో ఇంగ్లండ్‌- అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్‌ సందర్భంగా చాలా మంది అఫ్గనిస్తాన్‌కు మద్దతుగా నిలిచారు. మరి అఫ్గన్‌ జలేబి గురించి ఇంగ్లండ్‌ కంప్లైట్‌ చేయొచ్చా’’ అంటూ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా తన అభిప్రాయాలను సమర్థించుకున్నాడు. కొంతమంది చర్యను మొత్తంగా భారత జట్టు అభిమానులకు ఆపాదించడం సరికాదని హితవు పలికాడు.

ఈ నేపథ్యంలో నెటిజన్లు.. ‘నిజం చెప్పారు.. టీమిండియా వరకు వచ్చే సరికే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తారు ఎందుకో? అందరిని సమానంగా చూడాలన్న వారు అందరి పట్ల ఒకే రీతిలో ఆలోచించాలి’’ అని ఆకాశ్‌ చోప్రాకు మద్దతు పలుకుతున్నారు. మరికొందరేమో ఇలాంటి సున్నిత అంశాల పట్ల ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరుతున్నారు.

చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్‌ ఆజం

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు