Ind Vs Pak: ‘టీమిండియా నిర్ణయం సరైంది కాదు’.. ఎవరు తెలివి తక్కువోళ్లో తెలిసిందా?

14 Oct, 2023 21:35 IST|Sakshi
రోహిత్‌ శర్మ- బాబర్‌ ఆజం (PC: ICC)

పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఉందంటే ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ చేసే హడావుడి అంతా ఇంతా కాదు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఇప్పటికే మ్యాచ్‌కు ముందు తన పోస్టుతో నెటిజన్లకు దొరికిపోయిన అక్తర్‌.. దాయాదుల మ్యాచ్‌లో టాస్‌ సందర్భంగా తన వ్యాఖ్యలతో మరోసారి ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...

అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పాక్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌ పిచ్‌పై ఇదే సరైన నిర్ణయమన్న విశ్లేషణల నడుమ.. షోయబ్‌ అక్తర్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు.

‘‘ఈ వికెట్‌ చాలా బాగుంటుంది. రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడం నాకెందుకో సరైన నిర్ణయం అనిపించలేదు. అంతేకాదు.. వాళ్లు అదనపు స్పిన్నర్‌ను కూడా తీసుకోలేదు.

పాకిస్తాన్‌ ఇక్కడ తొలుత బ్యాటింగ్‌కు దిగడం నాకైతే సంతోషంగా ఉంది. వాళ్లు కచ్చితంగా మంచి స్కోరు చేస్తారు. టీమిండియా తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నదనిపిస్తోంది. పాకిస్తాన్‌ భారీగా పరుగులు చేసేందుకు వాళ్లు అవకాశమిచ్చారు’’ అని ఎక్స్‌ ఖాతాలో వీడియో షేర్‌ చేశాడు.

అయితే, అక్తర్‌ అంచనాలు తలకిందులైన విషయం తెలిసిందే. తాను టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ ఎంచుకునేవాడినన్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం వ్యాఖ్యలకు సమర్థింపుగా.. టీమిండియా బౌలర్లు అద్భుతం చేసి.. పాక్‌ను 191 పరుగులకే కట్టడి చేశారు.

జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీసి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. భారత బౌలర్ల దెబ్బకు 42.5 ఓవర్లకే పాక్‌ బ్యాటర్లు తోకముడిచారు. 

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్‌ శర్మ(86), శ్రేయస్‌ అయ్యర్‌(53- నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో విజయం అందించారు. వరల్డ్‌కప్‌ చరిత్రలో మరోసారి హిస్టరీని రిపీట్‌ చేస్తూ పాక్‌పై భారత్‌ పైచేయి సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తాజా ఎడిషన్‌లో హ్యాట్రిక్‌ గెలుపు అందుకుంది.

ఈ నేపథ్యంలో.. షోయబ్‌ అక్తర్‌ను ట్రోల్‌ చేస్తూ టీమిండియా ఫ్యాన్స్‌ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘తెలివి తక్కువ వాళ్లు ఎవరో అర్థమైందా? అక్తర్‌?’’ అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ ఆరంభానికి ముందు చరిత్ర పునరావృతం అంటూ చేసిన కామెంట్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘థాంక్యూ నీ మాట నిజమైంది’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్‌ ఆజం

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు