CWC 2023: వచ్చాడయ్యో ‘షమీ’.. ‘వారసత్వాన్నే’ నిలబెట్టంగా.. జట్టును ఫైనల్‌కు చేర్చంగా!

18 Nov, 2023 16:00 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామం.. సహాస్‌పూర్‌కు చెందిన తౌసీఫ్‌ అలీ యువకుడిగా ఉన్న సమయంలో ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందాడు.. మరి తనకున్న ఐదుగురు పిల్లల్లో ‘క్రికెట్‌’ వారసుడు అయ్యేదెవరు?

ఒక్కగానొక్క కూతురు సబీనా అంజుమ్‌తో పాటు ముగ్గురు కుమారులకు అంతగా ఆసక్తి లేదు. మిగిలిన ఆ ఒక్కడిపైనే నాన్న నమ్మకం.. 15 ఏళ్ల వయసులో అతడిని మొరదాబాద్‌లోని క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించాడు.

ఇంటి నుంచి అక్కడికి దాదాపు 30 కిలో మీటర్ల దూరం.. అయినా వెనక్కి తగ్గలేదు.. కొడుకును సైకిల్‌ మీద కూర్చోబెట్టుకుని మరీ తనే స్వయంగా అక్కడి దాకా తీసుకువెళ్లేవాడు. రైతుగా వచ్చే సంపాదనలో అగ్రభాగం అతడి కోసమే ఖర్చు పెట్టేవాడు.. 

నాన్న నమ్మకం వమ్ము చేయొద్దనే సంకల్పంతో ఆ పిల్లాడు అహర్నిషలు శ్రమించాడు.. కఠిన శ్రమకోర్చాడు.. కొత్త బంతితో మ్యాజిక్‌ చేయడం మాత్రమే కాదు.. పాత బంతిని ఉపయోగించి రివర్స్‌ స్వింగ్‌ రాబట్టే నైపుణ్యాలు పెంపొందించుకున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో సొంతరాష్ట్రానికి ఆడే అవకాశం కోసం ఎదురుచూశాడు కానీ.. సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అతడి కోచ్‌ బుద్రుద్దీన్‌ సిద్ధిఖీ అతడిని కోల్‌కతాకు పంపించాడు. అక్కడ దేవవ్రత దాస్‌ యూపీ కుర్రాడి బౌలింగ్‌ స్కిల్క్స్‌కు ఫిదా అయ్యాడు.

తన క్లబ్‌లో జాయిన్‌ చేసుకోవడమే గాకుండా.. తనతో పాటే తన ఇంట్లోనే ఉండేలా ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు బెంగాల్‌ సెలక్టర్లతో మాట్లాడి అండర్‌-22 జట్టుకు ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించాడు. 

అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ మోహన్‌ బగన్‌ క్రికెట్‌ క్లబ్‌కు ఆడే అవకాశం దక్కించుకున్న ఆ యూపీ అబ్బాయి.. టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీకి ఈడెన్‌ గార్డెన్స్‌లో నెట్స్‌లో బౌలింగ్‌ చేసే గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేశాడు.

దాదా కూడా అతడి ఆటకు ఫిదా అయ్యాడు. టీమ్‌కు సెలక్ట్‌ చేసేలా సిఫారసు చేశాడు. అలా 2010- 11లో బెంగాల్‌ తరఫున అరంగేట్రం చేసిన సదరు పేసర్‌.. 2010లో టీ20 జట్టుకు ఆడిన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ అడుగుపెట్టి ప్రతిభను చాటుకున్నాడు. 2012లో ఈస్ట్‌ జోన్‌ దులీప్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

అలా అంచెలంచెలుగా ఎదిగి ఇండియా-ఏ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌గా నిలిచి నాటి కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ను ఇంప్రెస్‌ చేశాడు.

ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, ఇండియా- ఏ జట్టు తరఫున సత్తా చాటుతూ.. టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2013లో పాకిస్తాన్‌తో వన్డే సందర్భంగా  అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఆ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక వికెట్‌ తీశాడు. ఆ తర్వాత మరింత మెరుగైన ప్రదర్శన కనబరచడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లాంటి మేటి జట్లతో మ్యాచ్‌లు.. ఆసియా కప్‌-2014 జట్టులోనూ చోటు.. 

ఇలా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనను తానూ నిరూపించుకున్న ఈ రైటార్మ్‌ పేసర్‌..  అదే ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌.. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఫేర్‌వెల్‌ మ్యాచ్‌..

మనోడు అక్కడా హిట్టే.. రివర్స్‌ స్వింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. 

వివాదాల ఊబిలో చిక్కుకుపోయి
అన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకున్న సమంలో గాయాల బెడద.. తీవ్ర విమర్శలు.. వైవాహిక జీవితంలో ఆటుపోట్లు.. కోర్టు కేసులు.. ఫిక్సింగ్‌ ఆరోపణలు.. స్త్రీలోలుడు అనే ముద్ర.. కన్నబిడ్డను తనతో పాటే ఒకే ఇంట్లో ఉంచుకోలేని దుస్థితి..

విడిపోదామని నిర్ణయించుకున్న భార్య..  కోట్లలో భరణం ఇవ్వాలనే డిమాండ్లు.. సంచలన ఆరోపణలతో విరుచుకుపడుతూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకువచ్చిన వైనం.. వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ పిటిషన్ల మీద పిటిషన్లు..

వెరసి అతడు అరెస్టు ఖాయం.. అతడి కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌ పడ్డట్లే అనే అభిప్రాయాలు.. కానీ.. అదృష్టం కలిసి వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది.

ఇలా ఓవైపు గాయాలు.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో సమస్యలు వేధిస్తున్నా ఆటపై నుంచి తన దృష్టి మరల్చలేదు. ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు శాయశక్తులా కృషి చేశాడు.

పంటపొలాల్లో పరుగులు
పేసర్ల కాళ్లు ఎంత బలంగా ఉంటే అంత మంచిదిఅందుకోసం అతడు ఏకంగా తన పొలంలోనే రన్నింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసుకున్నాడు. పొలాల వెంట పరుగులు తీస్తూ మరింత ఫిట్‌గా తయారయ్యేందుకు శ్రమించాడు. 

కట్‌చేస్తే.. జట్టులో పునరాగమనం... అటు ఐపీఎల్‌-2023లోనూ టాప్‌ వికెట్‌ టేకర్‌గా సత్తా.. 17 ఇన్నింగ్స్‌ ఆడి 28 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్టులో చోటు.. అయితే, పేస్‌ విభాగంలో మూడో ప్రాధాన్యంగానే అతడి పేరు.. జట్టు కూర్పు దృష్ట్యా తొలి నాలుగు మ్యాచ్‌లలో మొండిచేయే..

అప్పుడు రాకరాక వచ్చిందో ఛాన్స్‌.. పటిష్ట న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. వచ్చీ రాగానే ప్రపంచప్‌లో 5 వికెట్ల హాల్‌ నమోదు చేశాడు.

అంతేనా.. మరొసటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మీద 4 వికెట్ల హాల్‌.. ఆపై.. తన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చారిత్రాత్మక వాంఖడేలో అత్యద్భుత ప్రదర్శన.. 5 ఓవర్ల బౌలింగ్‌లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి.. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త చరిత్ర..

అతడి పేరు మహ్మద్‌ షమీ.. 33 ఏళ్ల రైట్‌ఆర్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పినట్లు.. షమీ నిజంగానే అతడికి వచ్చిన అవకాశాన్ని రెండుచేతులా ఒడిసిపట్టి అద్భుతాలు చేయగలడు!! వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీ ఫైనల్లో ఈ మాటను మరోసారి నిజం చేశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్లు కూల్చి.. జట్టును ఫైనల్‌కు చేర్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

అంతేకాదు వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో మూడుసార్లు ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు షమీ. అదే విధంగా తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 23 కూల్చి వికెట్ల వీరుల జాబితాలో అ‍గ్రస్థానానికి చేరుకున్నాడు. 
-సుష్మారెడ్డి యాళ్ల

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు