World Cup 2023: భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?

12 Nov, 2023 09:18 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న భారత్‌-నెదర్లాండ్‌ మ్యాచ్‌తో ఈ ​మెగా టోర్నీ లీగ్‌ స్టేజి ముగియనుంది. ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌లు  ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు అర్హత సాధించాయి.

నవంబర్‌ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత నవంబర్‌ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

అయితే భారత్‌-కివీస్‌ మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒక వేళ వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే ఏంటి పరిస్థితి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌, ఫైనల్‌కు ఐసీసీ రిజర్వ్‌డే కేటాయించింది. అంటే బుధవారం(నవంబర్‌ 15) వర్షం వల్ల మ్యాచ్‌ నిలిచిపోతే.. ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి గురువారం(నవంబర్‌ 16) తిరిగి కొనసాగించనున్నారు.

రిజర్వ్ డే రోజున ఆడే సమయం మ్యాచ్‌కి షెడ్యూల్ చేయబడిన రోజు మాదిరిగానే ఉంటాయి. అంతేకాకుండా అదనంగా మరో రెండు గంటల సమయాన్ని కూడా ఐసీసీ కేటాయించింది. రిజర్వ్‌డే రోజున ఫలితం తేలాలంటే ఇరు జట్లు   కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్యపడకపోతే పాయింట్లపట్టికలో లీడింగ్‌లో ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
చదవండి: చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్‌ ఆజం

మరిన్ని వార్తలు