WI VS ENG 1st ODI: చెత్త రికార్డు మూటగట్టుకున్న సామ్‌ కర్రన్‌

4 Dec, 2023 14:52 IST|Sakshi

వెస్టిండీస్‌తో నిన్న (డిసెంబర్‌ 3) జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్‌ లేకుండా  (9.5 ఓవర్లు) 98 పరుగులు సమర్పించుకున్న కర్రన్‌.. ఇంగ్లండ్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కర్రన్‌కు ముందు ఈ చెత్త రికార్డు స్టీవ్‌ హార్మిసన్‌ పేరిట ఉండేది. 2006లో శ్రీలంకతో జరిగిన  మ్యాచ్‌లో హార్మిసన్‌ వికెట్‌ లేకుండా 97 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్‌ తరఫున వన్డేల్లో అతి ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో క్రిస్‌ జోర్డన్‌ (2015లో 1/97), జేక్‌ బాల్‌ (2017లో 1/94) కర్రన్‌, హార్మిసన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్‌ కాగా.. విండీస్‌ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిలిప్‌ సాల్ట్‌ (45), జాక్‌ క్రాలే (48), సామ్‌ కర్రన్‌ (28), బ్రైడన్‌ కార్స్‌ (31 నాటౌట్‌) పర్వాలేదనిపించగా.. విండీస్‌ ఇన్నింగ్స్‌లో హోప్‌తో పాటు అలిక్‌ అథనాజ్‌ (66), రొమారియో షెపర్డ్‌ (49), బ్రాండన్‌ కింగ్‌ (35), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (32) రాణించారు. ఇరు జట్ల మధ​ రెండో వన్డే డిసెంబర్‌ 6న జరుగనుంది.

>
మరిన్ని వార్తలు