WI Vs Eng: ఇంగ్లండ్‌పై శతక్కొట్టిన విండీస్‌ కెప్టెన్‌.. ​ క్రెడిట్‌ మొత్తం ధోనికే!

4 Dec, 2023 15:00 IST|Sakshi
ధోని- షాయి హోప్‌ (PC: BCCI/WI)

West Indies vs England, 1st ODI: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ షాయీ హోప్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అజేయ శతకంతో అదరగొట్టి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ఆంటిగ్వా వేదికగా ఆదివారం జరిగిన వన్డేలో మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న షాయీ హోప్‌.. 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

తద్వారా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విండీస్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం తన అద్బుత ఇన్నింగ్స్‌ గురించి షాయీ హోప్‌ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి క్రెడిట్‌ ఇచ్చాడు.

‘‘నా సెంచరీ జట్టు విజయానికి కారణమైనందుకు సంతోషిస్తున్నా. మేము మ్యాచ్‌ గెలవడం ఆనందంగా ఉంది. కొన్నాళ్ల క్రితం నేను ఎంఎస్‌ ధోనితో మాట్లాడాను. అనుకున్న దాని కంటే ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించమని చెప్పాడు. కీలక సమయంలో వికెట్‌ కాపాడుకోవడం ముఖ్యమన్నాడు. 

ఈరోజు అలాగే ఆడాను. షెఫర్డ్‌ కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. విజయంతో సిరీస్‌ను ఆరంభించడం సంతోషం. తదుపరి మ్యాచ్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తున్నాం’’ అని షాయి హోప్‌ పేర్కొన్నాడు. క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం వంటి తప్పులు రిపీట్‌ చేయకుండా జాగ్రత్తపడతామని పేర్కొన్నాడు.  

కాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్‌ విధించిన 326 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలోనే ఛేదించింది. సిక్సర్‌తో విండీస్‌ విజయాన్ని ఖరారు చేసిన కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ షాయి హోప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: T20: గిల్‌కు ఇకపై గట్టి పోటీ.. వరల్డ్‌కప్‌లో ఆడాలంటే!

>
మరిన్ని వార్తలు