World Cup 2023 Final: ఆసీస్‌తో ఫైనల్‌ పోరు.. సిరాజ్‌కు నో ఛాన్స్‌!? జట్టులోకి సీనియర్‌ ఆటగాడు

18 Nov, 2023 16:44 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్‌ 19)న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ముద్దాడాలని భారత జట్టు భావిస్తుంటే.. ఆస్ట్రేలియా మాత్రం తమ వరల్డ్‌కప్‌ చరిత్రను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.

ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక ఈ తుదిపోరులో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ స్ధానంలో వెటరన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవకాశమివ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాపై అశ్విన్‌కు మంచి రికార్డు ఉండడంతో తుది జట్టులోకి తీసుకురావాలని హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అశ్విన్‌ ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. లీగ్‌ దశలో చెపాక్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. 8 ఓవర్లు వేసిన అశూ.. 34 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు. దీంతో మరోసారి అతడి అనుభవాన్ని ఊపయోగించుకోవాలని టీమిండియా మేనెజ్‌మెంట్‌ ఆలోచిస్తోంది. కాగా ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు అశ్విన్‌ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీంతో అతడు ఫైనల్‌ మ్యాచ్‌కు తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది

ఆసీస్‌తో ఫైనల్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌ తుది పోరు రేపే.. ఫైనల్స్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?

మరిన్ని వార్తలు