WPL Players Auction 2023: WPL వేలంలో జాక్‌పాట్‌ కొట్టిన కర్నూలు అమ్మాయి

13 Feb, 2023 18:04 IST|Sakshi

ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగుతున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్‌ (WPL) మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కనక వర్షం కురుస్తుంది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు సొం‍తం చేసుకోగా.. దీప్తి శర్మ (యూపీ వారియర్జ్‌, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్‌, 2 కోట్లు), రిచా ఘోష్‌ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్‌ (ముంబై ఇండియన్స్‌, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (ముంబై ఇండియన్స్‌, 1.8 కోట్లు), రేణుకా సింగ్‌ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్‌, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు.

వేలంలో ఊహించని ధర పలికిన వారిలో కర్నూలు అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి కూడా ఉంది. 25 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ అయిన శర్వాణిని యూపీ వారియర్జ్‌ 55 లక్షలకు దక్కించుకుంది. 30 లక్షల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో పోటీపడ్డ అంజలీని యూపీ వారియర్జ్‌ పోటీపడి మరీ సొంతం చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన శార్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి, సత్తా చాటింది. ఆ సిరీస్‌లో శర్వాణి ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8.73 సగటున 3 వికెట్లు పడగొట్టింది. టీమిండియా తరఫున ఓవరాల్‌గా 6 టీ20లు ఆడిన శర్వాణి 2/34 అత్యుత్తమ ప్రదర్శనతో 3 వికెట్లు తీసుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కూడా శర్వాణి సభ్యురాలిగా ఉంది.  

మరిన్ని వార్తలు