న్యాయ నిపుణులతో రెజ్లర్ల చర్చలు

6 May, 2023 05:04 IST|Sakshi

కొనసాగుతున్న నిరసన  

న్యూఢిల్లీ: పోలీసుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ భారత స్టార్‌ రెజ్లర్లు తమ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం, సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగియడం... ఢిల్లీ న్యాయపరిధిలో తేల్చుకోవాలన్న కోర్టు సూచనపై రెజ్లర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘శుక్రవారం రెండు కమిటీలు ఏర్పాటు చేశాం.

ఖాప్‌ పంచాయత్, రైతులు, మహిళా సంఘాలకు చెందిన 31 మంది సభ్యులున్న ఒక కమిటీ, తొమ్మిది మంది సభ్యులుగా ఉన్న మరో కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నిజం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముగ్గురు రెజ్లర్లకే ఈ పోరాటం పరిమితం కాదు. హైకోర్టుకు వెళ్లి మళ్లీ మా పోరాటం మొదలుపెట్టే అవకాశాలున్నాయి’ అని రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా తెలిపాడు.  

దర్యాప్తుతోనే వాస్తవాలు: క్రీడల మంత్రి ఠాకూర్‌
‘రెజ్లర్ల డిమాండ్లన్నీ తీరుతాయి. ముందయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరగనివ్వండి. దీనిపై సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. విచారణలో పోలీసులు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తే... న్యాయబద్ధంగా గట్టి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది’ అని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు.

గంగూలీ ఏమన్నాడంటే...
భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ ‘రెజ్లర్లు దేశానికెంతో చేశారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. వారి పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. ఈ వ్యవహారంపై నాకు పూర్తి వివరాలు తెలియదు. పత్రికల్లో చదివిందే! ఏదేమైనా ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని
ఆశిస్తున్నా’ అని అన్నాడు. 

>
మరిన్ని వార్తలు