Yash Dayal: అమ్మో.. క్రీజులో అతడు ఉన్నాడంటే చెమటలే.. ఏ బంతినీ వదలడు!

4 Jun, 2022 12:11 IST|Sakshi
గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌, యశ్‌ దయాల్‌(PC: IPL/BCCI)

IPL 2022 Gujarat Titans: శుభ్‌మన్‌ గిల్‌ నెట్స్‌లో తనను బాగా ఇబ్బంది పెట్టాడని, తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్‌ అతడేనని గుజరాత్‌ టైటాన్స్‌ యువ బౌలర్‌ యశ్‌ దయాల్‌ అన్నాడు. గిల్‌ క్లాసికల్‌ బ్యాటర్‌ అంటూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ యశ్‌ దయాల్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

కోల్‌కతా, ఆర్సీబీ ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ.. అతడి కోసం ఏకంగా 3.20 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన యశ్‌.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఫైనల్లోనూ ఒక వికెట్‌ తీశాడు.

రాజస్తాన్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ను పెవిలియన్‌కు పంపి గుజరాత్‌కు శుభారంభం అందించాడు. తద్వారా అరంగేట్రంలోనే టైటిల్‌ గెలిచిన గుజరాత్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌-2022 అనుభవాల గురించి ఇండియా న్యూస్‌తో పంచుకున్న యశ్‌ దయాల్‌.. తనను ఇబ్బంది పెట్టిన బ్యాటర్ల గురించి చెప్పుకొచ్చాడు.

‘‘నెట్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టం. ఏ షాట్‌ అయినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాదడమే తనకు అలవాటు. అద్భుతమైన షాట్లు ఆడతాడు. క్లాసికల్‌ బ్యాటర్’’ అంటూ ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ సహచర ఆటగాడిని కొనియాడాడు.

అదే విధంగా.. వృద్ధిమాన్‌ సాహా క్రీజులో ఉంటే కష్టమేనని, పవర్‌ప్లేలో అతడిని ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి బౌలర్‌ ఆచితూచి ఆడాల్సిందేనని యశ్‌ దయాల్‌ చెప్పుకొచ్చాడు. డేవిడ్‌ మిల్లర్‌ కూడా ప్రమాదకరమైన బ్యాటర్‌ అని పేర్కొన్నాడు. ఇక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎదుర్కోవడం కష్టంగా అనిపించిందని తన అనుభవాన్ని పంచుకున్నాడు.

చదవండి👉🏾 IPL 2022: 'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది'
చదవండి👉🏾IPL 2022: ఐపీఎల్‌ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్‌ఆర్‌హెచ్‌..!

మరిన్ని వార్తలు