సత్యసాయి విద్యాసంస్థల్లో కీలక ఘట్టాలు ఇలా..

22 Nov, 2023 01:20 IST|Sakshi

ప్రశాంతి నిలయం: స్నాతకోత్సవ సంబరానికి సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ ముస్తాబైంది. బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా ఇంటర్నేషన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే 42వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరుకానున్నారు. ఇందుకోసం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. స్నాతకోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది పరిశోధనా విద్యార్థులకు డాక్టరేట్లు, 21 మందికి గోల్డ్‌ మెడళ్లు, 560 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నారు.

విలువల నిలయం

సత్యసాయిబాబా తాను బోధించిన మానవతా విలువలు, ఆధ్యాత్మికత కలగలిపి ఆధునిక విజ్ఞానాన్ని అందించేందుకు సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ పేరుతో 1981లో చక్కటి విద్యా వ్యవస్థను నెలకొల్పారు. అనంతర కాలంలో సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. సత్యసాయి భారతీయ విద్యావిధానంలో అనాదిగా అమలవుతున్న గురుకుల విద్యా విధానానికి మెరుగులుదిద్దుతూ, నేటి సమాజ అవసరాల మేరకు మార్పులు చేసి నూతన గురుకుల విధానాన్ని అమలయ్యేలా విద్యా వ్యవస్థలను రూపొందించారు. మానవతా విలువలు, ఆధ్యాత్మికత, శాస్త్ర సాంకేతిక అంశాలతో కూడిన సమ్మిళిత విద్యను బోధిస్తూ అత్యద్భుతమైన ఫలితాలతో ప్రపంచంలోనే మేటి విద్యాసంస్థల సరసన నిలిపారు. విద్య వ్యాపారమైన నేటి రోజుల్లోనూ సత్యసాయి విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు నయాపైసా వసూలు చేయకుండా ప్రమాణాలతో కూడిన ఆదర్శ విద్యను అందిస్తున్నారు. అందువల్లే సత్యసాయి విద్యాసంస్థలు విలువల నిలయాలుగా వేనోళ్ల కీర్తింపబడుతున్నాయి. సత్యసాయి 98వ జయంత్యుత్సవాల్లో భాగంగా బుధవారం సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌(సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ) 42వ స్నాతకోత్సవం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.

పటిష్టమైన పాలనా వ్యవస్థ

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ అనుబంధంగా సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ కొనసాగుతోంది. పబ్లిక్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌గా ఫౌండర్‌ చాన్సలర్‌ హోదాలో సత్యసాయి కొనసాగుతుండగా, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు, ట్రస్ట్‌ సభ్యుడు ఎస్‌.ఎస్‌ నాగానంద, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ త్యాగరాజన్‌, చైన్నెకి చెందిన మధుమేహ వ్యాధి నిపుణుడు డాక్టర్‌.వి మోహన్‌, సత్యసాయి విద్యాసంస్థల మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేబిర్‌ వర్మ సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు మరో 13 మందితో కూడిన బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఆరుగురు సభ్యులతో కూడిన అకడమిక్‌ కౌన్సిల్‌ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ పరిపాలన, అకడమిక్‌ వ్యవహారాలు చూస్తుంది.

రెండు రాష్ట్రాలు ...నాలుగు క్యాంపస్‌లు

పుట్టపర్తిలోని యూనివర్సిటీ పరిపాలనా భవనం నుంచి పాలన కొనసాగుతున్నా, కోర్సులు మాత్రం ఏపీ, కర్ణాటక రాష్ట్రంలో నెలకొల్పిన నాలుగు క్యాంపస్‌ల ద్వారా నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ముద్దెనహళ్లి, బృందావన్‌ క్యాంపస్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టపర్తి ప్రశాంతి నిలయం క్యాంపస్‌తో పాటు, అనంతపురంలోని మహిళా క్యాంపస్‌ల ద్వారా విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. చక్కటి క్రీడా మైదానాలు, లేబొరేటరీలు, మల్టీమీడియా సెంటర్లు, క్రీడా సౌకర్యాలతో విద్యార్థులకు సౌకర్యవంతంగా క్యాంపస్‌లను తీర్చిదిద్దారు.

అనంతపురం క్యాంపస్‌

మహిళా విద్యను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సత్యసాయి 1968లోనే అనంతపురంలో 115 ఎకరాల విస్తీర్ణంలో మహిళా క్యాంపస్‌ను నెలకొల్పారు. క్యాంపస్‌లో మహిళలకు మాత్రమే ప్రవేశాలు కల్పించారు. ఈ క్యాంపస్‌ ద్వారా మహిళలకు అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బీఏ, బీఎస్సీ, బీకాం, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఎంఏ, ఎంఎస్సీ, ప్రొఫెషనల్స్‌ బీఈడీ, ఎంబీఏ, పరిశోధనలో పీహెచ్‌డీ కోర్సులు నిర్వహిస్తున్నారు.

● 1968లో సత్యసాయి అనంతపురంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలను మహిళల కోసం ఏర్పాటు చేశారు. 1969లో బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ సమీపంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, కామర్స్‌ కళాశాలను ఏర్పాటు. 1978లో బృందావన్‌ క్యాంపస్‌లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల నూతన భవనం ప్రారంభం. 1978లో పుట్టపర్తిలోని సత్యసాయి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి.

● 1981 అక్టోబర్‌ 31న సత్యసాయి విద్యాసంస్థలన్నింటినీ కలిపి సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ ఏర్పాటు. 1981 నవంబర్‌ 10న సత్యసాయి డీమ్డ్‌ టూ బి యూనివర్సిటీగా డిక్లేర్‌. 1982 నవంబర్‌ 22న సత్యసాయి డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీ ప్రారంభం. 1984 జూన్‌1న పీహెచ్‌డీ కోర్సులు ప్రారంభం. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తామని 1986 జూలైలో సత్యసాయి ప్రకటన. 2018 నవంబర్‌ 22న రూ.10 కోట్ల వ్యయంతో వర్సిటీ సెంట్రల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభం.

నేడు సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం

సాయి హీరా ఇంటర్నేషన్‌ కన్వెన్షన్‌

సెంటర్‌ వేదికగా వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొననున్న

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్‌

అబ్దుల్‌ నజీర్‌

14 మందికి డాక్టరేట్లు,

21 మందికి బంగారు పతకాలు

ప్రశాంతి నిలయం క్యాంపస్‌

పుట్టపర్తిలో 57 ఎకరాల విస్తీర్ణంలో 1979లో ఈ క్యాంపస్‌ నెలకొల్పారు. క్యాంపస్‌ ద్వారా అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బీఏ, బీఎస్సీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఎంఏ, ఎంఎస్సీ, ప్రొఫెషనల్స్‌ ఎంబీఏ, ఎంటెక్‌, పరిశోధనా రంగంలో పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తున్నారు.

ముద్దెనహళ్లి క్యాంపస్‌

ఈ క్యాంపస్‌ కర్ణాటక రాష్టంలోని చిక్‌బళ్లాపూర్‌కు సమీపంలోని ముద్దెనహళ్లి వద్ద 2012లో ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బీబీఏ, బీఎస్సీ కోర్సులు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఎంఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది.

బృందావన్‌ క్యాంపస్‌

బృందావన్‌ క్యాంపస్‌ బెంగళూరు సమీపంలోని వైట్‌ఫీల్డ్‌ వద్ద 1969లో 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్‌ ద్వారా అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బీఎస్సీ, బీకాం కోర్సులు నిర్వహిస్తున్నారు. అలాగే పీహెచ్‌డీ అమలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు