మత్స్యకారుల సంక్షేమానికి కృషి

22 Nov, 2023 01:20 IST|Sakshi
మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు అందజేస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

పుట్టపర్తి అర్బన్‌: చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ అరుణ్‌బాబు, జిల్లా అగ్రి అడ్వయిజరీ బోర్డు చైర్మన్‌ అవుటాల రమణారెడ్డి, జిలా మత్స్యకార శాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మత్స్యకారుల సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, మత్స్యకారుడు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం తదితర ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అలాగే చేపల అమ్మకాలు పెంచేందుకు జిల్లాలో 35 క్యాంటిన్‌ యూనిట్లను ప్రారంభించారన్నారు. వీటి ద్వారా నాణ్యమైన చేపల వంటకాలు రుచి చూడవచ్చన్నారు. అర్హులైన మత్స్యకారులందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు తాడేపల్లిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ప్రారంభించగా, జిల్లా అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

16 ద్విచక్ర వాహనాలు అందజేత

మత్స్యశాఖ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉంటూ చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకార కార్మికులకు కలెక్టర్‌ అరుణ్‌బాబు 16 ద్విచక్ర వాహనాలను అందజేశారు. ఒక్కో వాహనం విలువ రూ.75 వేలు ఉంటుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశీయ చేపల వినియోగాన్ని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈక్రమంలోనే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ‘ఫిష్‌ అంధ్రా’ చేపల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. చేప పిల్లల పెంపకం కోసం పేరూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 7.63 లక్షల చేపల పిల్లలను వదిలినట్లు చెప్పారు. పెనుకొండ సమీపంలోని కియా వద్ద 40 శాతం సబ్సిడీతో ఫిష్‌ డైలీ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని 47 మత్స్యకార సహకార సొసైటీల అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అర్హులైన 469 మంది మత్స్యకారులకు వైఎస్సార్‌ పెన్షన్‌ కింద రూ.2,750 చొప్పున పింఛన్‌ అందజేస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుతం 17 ద్విచక్ర వాహనాలు, రూ.30 వేలు విలువ చేసే ఐస్‌ బాక్సులను 40 శాతం సబ్సిడీతో అందజేసినట్లు వెల్లడించారు.

మత్స్యకారుల ఆదుకున్న ఏకై క సర్కార్‌

అగ్రి బోర్డు చైర్మన్‌ అవుటాల రమణారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు. కానీ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఎస్సీ, ఎస్టీ బీసీలతో సమానంగా మత్స్యకారులకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నారన్నారు. అలాగే నామినేటెడ్‌ పదవుల్లోనూ వారికి అవకాశం ఇచ్చారన్నారు. ఆక్వా రైతులకు యూనిట్‌ కేవలం రూ.1.50కే అందజేస్తున్నారన్నారు. ఫిషింగ్‌ హార్బర్లు, మర పడవలు, ల్యాండింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి మత్స్యకారులను ఆదుకుంటున్నారన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ఇంతలా పాడుతున్న ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

‘ఫిష్‌ ఆంధ్రా’ అద్భుతం

చేపల వంటకాలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా జిల్లాలో ఫిష్‌ ఆంధ్రా యూనిట్లు ఏర్పాటు చేయడం నిజంగా అద్భుతం. పెనుకొండ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్‌ ఆంధ్రా దుకాణం నిత్యం రద్దీగా ఉంటోంది. అన్నిచోట్లా ఏర్పాటైతే చేపల పెంపకంపై ఆధారపడిన మా జీవనానికి ఇబ్బంది ఉండదు.

– నాగరాజు, పెనుకొండ

జగన్‌తోనే మత్స్యకారుల సంక్షేమం

నేను చిన్నప్పటి నుంచీ చేపలు పట్టి జీవనం సాగిస్తున్నా. గతంలో ఎవరూ మా సంక్షేమం గురించి ఆలోచించ లేదు. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాకు ద్విచక్ర వాహనాలు, ఐస్‌ బాక్సులు, వలలు అందజేస్తున్నారు. చేపలతో వండిన ఆహార పదార్థాల గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ మాకు ఎంతో మేలు చేస్తున్నారు. మాకోసం ఇంతలా ఆలోచించిన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు.

– నాగేంద్ర, మత్స్యకారుడు, కొత్తచెరువు

చేపల వేటే జీవనాధారం

మేము చెరువుల్లో చేపలు పట్టి గ్రామాల్లో విక్రయిస్తాం. తద్వారా వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం మంజూరు చేసిన వాహనం వల్ల మరిన్ని గ్రామాలకు తిరిగి చేపలను విక్రయించుకునే అవకాశం కలిగింది. ఒక్కో వ్యక్తికి రూ.75 వేల విలువైన వాహనం అందజేయడం సంతోషంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు.

– ఫకృద్దీన్‌, ముత్యాలచెరువు, కదిరి

ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో

కలెక్టర్‌ అరుణ్‌బాబు

16 మంది మత్స్యకారులకు

ద్విచక్ర వాహనాల పంపిణీ

మరిన్ని వార్తలు