ఓటరు జాబితా సవరణ పక్కాగా జరగాలి

29 Nov, 2023 01:26 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ‘‘ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన క్లెయిమ్‌ల పరిష్కారం పక్కగా జరగాలి. జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి రికార్డులన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. రాజకీయ పార్టీల నుంచి అందిన అభ్యంతరాలు, ఓట్ల తొలగింపునకు అందిన క్లెయిమ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతనే పరిష్కరించాలి’’ అని జిల్లా ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌ డి.మురళీధర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్‌ అరుణ్‌బాబుతో కలిసి ఓటరు జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, నిబంధనల ప్రకారం తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించాలన్నారు. అందిన క్లెయిమ్‌లన్నీ ఎప్పటికప్పుడు పరిష్కారించాలన్నారు. ఓటరు తుది జాబితా తయారీలో అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు.

రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు

కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ... ఓటు తొలగింపు, నమోదుపై నిర్దిష్టమైన ఆధారాలతో రాతపూర్వక ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు సమాచారం ఇస్తే ప్రజాప్రాతినిథ్యం చట్టం 1950 (సెక్షన్‌ 31) ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచనామా సమాచారం ఇస్తే మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగిస్తామన్నారు. నూతన ఓటర్ల చేర్పులు, తొలగింపులపై 10 రోజుల్లో దరఖాస్తులన్నీ పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. నూతన ఓటర్ల నమోదు కోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అన్ని వివరాలను తెలియజేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్‌ క్లెయిమ్‌ అభ్యంతరాలకు సంబంధించి, సిమిలర్‌ ఎంట్రీస్‌, జంక్‌ క్యారెక్టర్లు, పది మంది ఓటర్లు ఉన్న కుటుంబాలు, జెండర్‌ నిష్పతి, ఎపిక్‌ కార్డుల జనరేషన్‌ తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నవంబర్‌ 27వ తేదీ వరకూ ఫారం–6కు సంబంధించి 21,842 దరఖాస్తులు స్వీకరించామని, అందులో 16,300 పరిష్కరించామని వివరించారు. మరో 2,088 దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు. ఫారం–7కు సంబంధించి 17,471 దరఖాస్తులను స్వీకరించామని, అందులో 9,639 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. మిగితా 1,975 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డీఆర్‌ఓ కొండయ్య, స్వీప్‌ అధికారి శివరంగ ప్రసాద్‌, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణారెడ్డి, రమేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, బీజేపీ నాయకుడు రాజు, కాంగ్రెస్‌ నాయకుడు గౌస్‌బాషా, సీపీఎం నాయకుడు ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

నూతన జాబితాపై ఒక్క అభ్యంతరమూ

ఉండకూడదు

నిబంధనల ప్రకారం క్ల్లెయిమ్‌లు

పరిష్కరించాలి

అధికారులకు జిల్లా ఎలక్షన్‌ రోల్‌

అబ్జర్వర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశం

మరిన్ని వార్తలు