● ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలసీ –2023ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ ● వరదల కట్టడికి ప్రత్యేక ప్రణాళిక

15 Mar, 2023 00:52 IST|Sakshi

సాక్షి, చైన్నె: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం అమల్లో భాగంగా ‘‘తమిళనాడు ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలసీ – 2023ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగం రూపకల్పనకు నిర్ణయించారు. వివరాలు.. శాసనసభలో ఈనెల 21న వ్యవసాయ బడ్జెట్‌ను ప్రభుత్వం దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో పేర్కొనే అంశాలకు బలాన్ని చేకూర్చేందుకు ఈ పాలసీని తాజాగా ఆవిష్కరించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ఈ పాలసీని విడుదల చేయగా, వ్యవసాయ మంత్రి ఎంఆర్‌కే పన్నీరుసెల్వం అందుకున్నారు. సీఎస్‌ ఇరై అన్భుతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నిపుణుల కమిటీ సూచనల మేరకు..

వ్యవసాయంలో రైతు సంక్షేమం, ఆర్థిక బలోపేతంతో పాటు ‘‘రసాయన ఎరువులు పురుగుమందుల మితిమీరి వాడకం వల్ల ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ కారణంగా భూమిలోని సూక్ష్మజీవులు, వాన సాముల సంఖ్య కనుమరుగు అవుతోంది. అలాగే భూసారం తగ్గి పర్యావరణానికి హాని కల్గుతోండడంతో రోగ నిరోధక శక్తిని పెంచడం, సహజ వ్యవసాయ శాస్త్ర ఉత్పత్తులకు డిమాండ్‌, అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ నిపుణుల పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఆర్గానిక్‌ పాలసీ తీసుకొచ్చారు. ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలసీ, ప్రోగ్రామ్‌, రెగ్యులేషన్‌ లక్ష్యంగా ఇందులో పలు అంశాలను పొందు పరిచారు. ఆర్గానికి ఫామ్‌లను విస్తృతం చేయడం, ఏర్పాటుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించడం, వనరుల పరిరక్షణ, ఆర్గానికి కంబైన్డ్‌, మిక్స్‌డ్‌ పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. పౌష్టికాహర భద్రత, చిరుధాన్యాల ఉత్పత్తి, కూరగాయాలు, పంట సాగుబడి విస్తీర్ణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే నేచురల్‌ ఫామింగ్‌, ఆర్గానిక్‌ ఫామింగ్‌ మధ్య ఉన్న వ్యత్యాసాలను గురించి సైతం ఈ పాలసీలో వివరించారు.

రాష్ట్రంలో సేంద్రియ ఉత్పత్తుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. ఆర్గానిక్‌ అగ్రికల్చరల్‌ –2023 పేరిట రూపొందించిన ఈ పాలసీని మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్‌ ఆవిష్కరించారు. రైతు సంక్షేమం, ఆహార భద్రత, స్థిరమైన సేంద్రియ వ్యవసాయాభివృద్ధికి ఇందులో ప్రాధాన్యమిచ్చారు.

వరదల నివారణకు కార్యాచరణ..

చైన్నె నగరం గత కొన్నేళ్లుగా ఏటా వర్షాల సీజన్‌లో నీట మునుగుతున్న విషయం తెలిసిందే. దీనిని కట్టడి చేయడమే లక్ష్యంగా డాక్టర్‌ తిరుపుగల్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ బృందం చైన్నె శివారుల నుంచి తన అధ్యయాన్ని నిర్వహించి, సమగ్ర నివేదికను మంగళవారం సచివాలయంలో సీఎంకు అందజేసింది. వరదల నివారణే లక్ష్యంగా శాశ్వతపరిష్కారం చూపించేందుకు ఈ నివేదికలో అంశాలను పొందు పరిచారు. ఇప్పటికే జరుగుతున్న వర్షపు నీటి కాలువల నిర్మాణం గురించి గతంలో ఇదే కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే.

ప్రధానికి సీఎం లేఖ..

శ్రీలంక నావికాదళం రెండురోజుల క్రితం 16 మంది తమిళ జాలర్లను బందీగా పట్టుకెళ్లిన విషయం తెలిసిందే. వీరిని విడుదల చేయాలని, అలాగే, శ్రీలంక ఆధీనంలో ఉన్న తమిళనాడుకు చెందిన 102 పడవలను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం స్టాలిన్‌ లేఖ మంగళవారం రాశారు. ఇటీవలి కాలంలో జాలర్లపై జరుగుతున్న దాడులను గుర్తు చేస్తూ, వీటి కట్టడికి శ్రీలంకపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

సద్వినియోగం చేసుకోండి..

తమిళనాడు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ బ్రిడ్జ్‌ 50వ వార్షికోత్సవం మంగళవారం నందంబాక్కం ట్రేడ్‌ సెంటర్‌లో జరిగింది. ఇందులో సీఎం స్టాలిన్‌ ప్రసంగిస్తూ, తమిళనాడులోని అపారమైన మానవ వనరులను సమకూర్చే విధంగా ఈ సదస్సు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. అలాగే తమిళనాడు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రభుత్వంతో ఇదే వేదికపై కుదుర్చుకున్న రెండు ఒప్పందాల గురించి వివరించారు. ఇది సాంకేతిక యుగం అని పేర్కొంటూ, మనిషి రోజు వారి అవసరాలలోను చూస్తుంటే, ప్రతి ఒక్కరి జీవితంలో సాంకేతికత భాగమైపోయిందన్నారు. సాంకేతిక అభివృద్ధి గొప్ప అవకాశమని అయితే, దీనిని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఐటీ రంగంలో తమిళనాడు దూసుకెళ్తోందని, ఈ బాటలోనే ద్రవిడ మోడల్‌ పాలన సాగుతోందన్నారు. ప్రస్తుతం సమాచార, సాంకేతిక వ్యవస్తను రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటూ తమిళనాడులో అల్లర్లే లక్ష్యంగా కొందరు పెద్ద కుట్రలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాచార వ్యవస్థకు బానిస కాకూడదని, అవసరాలకు అనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే సాంకేతికత కారణంగా అశ్లీలం పెరిగిందని, ఆన్‌లైన్‌ గేమింగ్‌లు విస్తృతమైన ఎందరినో బలి కొంటున్నాయని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు