స్టే ఉండగా.. పీటీ వారెంట్‌ ఎలా జారీ చేస్తారు?

6 Sep, 2023 07:29 IST|Sakshi
శశికళ, ఇలవరసి

సాక్షి, చైన్నె: పరప్పన అగ్రహార జైలులో లగ్జరీ జీవితం గడపిన వ్యవహారంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, ఈమె వదినమ్మ ఇలవరసిపై పీటీ వారెంట్‌ జారీ అయ్యింది. బెంగళూరు లోకాయుక్త మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో స్టే ఉండగా ఎలా..? వారెంట్‌జారీ చేస్తారని చిన్నమ్మ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, ఆమె వదినమ్మ ఇలవరసి బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో వీరు ఆ జైల్లో లగ్జరీ జీవితాన్ని గడిపినట్టు వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి తరచూ బయటకు షాపింగ్‌కు వెళ్లడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారులు అవినీతికి మరిగి, లంచం పుచ్చుకుని చిన్నమ్మ, వదినమ్మకు లగ్జరీ జీవితం గడిపే అవకాశం కల్పించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు బెంగళూరు ఏసీబీ అధికారులు శశికళ, ఇలవరసిని కూడా టార్గెట్‌ చేశారు.

విచారణకు హాజరుకాకపోవడంతో..
ఈకేసులో తొలి నిందితుడిగా అక్కడి జైళ్ల శాఖ పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్‌, పరప్పన అగ్రహార జైలు అధికారులు అనిత, సురేష్‌ నాగరాజ్‌కు సంబంధించిన కేసు లోకాయుక్త కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తొలి నిందితులిగా జైలు పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్‌, పరస్పన అగ్రహార అధికారులు అనిత, సురేష్‌ నాగరాజ్‌ను రెండు, మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఐదు, ఆరో నిందితులుగా శశికళ, ఇలవరసి ఉన్నారు. ఈ కేసు బెంగళూరు లోకాయుక్తలో విచారణలో ఉంది.

ఈ విచారణకు నేరుగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో కోర్టును ఆశ్రయించారు. మినహాయింపు పొందారు. అయితే, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇది వరకు సూంచింది. ఆ మేరకు పలుమార్లు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. అయితే, విచారణకు ఈ ఇద్దరు వెళ్లలేదు. దీంతో లోకాయక్త కోర్టు కన్నెర్ర చేసింది. ఈ ఇద్దరికీ పిటీ వారెంట్‌ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 6వ తేదీకి వాయిదా పడింది. కాగా చిన్నమ్మను అరెస్టు చేస్తారేమో అన్న బెంగ ఆమె మద్దతు దారులలో నెలకొంది.

అయితే కోర్టు విచారణకు హాజరు కావడంలో కోర్టు మినహాయింపు ఉన్నా.. ఎలా వారెంట్‌ జారీ చేస్తారని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని చిన్నమ్మ న్యాయవాదులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు