‘జయలలిత డబ్బులు కాజేసి పైకొచ్చాడు’

30 Oct, 2023 13:31 IST|Sakshi

మేడ్చల్‌ రూరల్‌: పాలమ్మి, పూలమ్మి మంత్రి మల్లారెడ్డి ధనవంతుడు కాలేదని, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి, ఇతరుల ఆస్తులు కాజేసి పై కొచ్చాడని మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం రాత్రి మాజీ సర్పంచ్‌ భేరి ఈశ్వర్‌ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి వజ్రేశ్‌ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్‌గౌడ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుదీర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని అందులో డైయిరీ ఫాం ఏర్పాటు చేసుకుందన్నారు. ఆ సమయంలో పాలవ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడికి వెళ్లేవాడన్నారు.

ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు  సమాచారం అందడంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఓ చోట దాచిపెట్టగా  మల్లారెడ్డి వాటిని దొంగిలించాడన్నారు. తన ఇంటి  పక్కన ఉండే క్రిస్టియన్‌ విద్యా సంస్థల యజమానురాలిని మోసం చేసి   కుటుంబీకులకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని  ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి కాజేశాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మైసమ్మగూడలో చెరువు శిఖం స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కాలేజీలు కట్టడం వల్లే మొన్న భారీ వర్షాల కారణంగా విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారన్నారు. 

 కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు  చివరకు తమ మేనిఫెస్టోను కాఫీ కొట్టారని ఎద్దేవా చేశారు.    కేసీఆర్‌ కుటుంబానికి పదవీ వ్యామోహం ఎక్కువన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వజ్రేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ  ఎన్నికల్లో డబ్బులు పంచి, బెదిరింపులకు పాల్పడి గతంలో గెలిచారని కానీ ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారన్నారు.  మంత్రి మల్లారెడ్డి, అతని బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో ఉండి చేసిందేమీ లేదన్నారు. తమ వ్యాపారాల కోసమే మేడ్చల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాళాల, మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి వెలుగులోకి తెస్తామని తనకు మేడ్చల్‌ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్‌గౌడ్, మున్సిపల్‌ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌ భేరి ఈశ్వర్,  నాయకులు  రమణారెడ్డి, మహేశ్‌గౌడ్, పోచయ్య, వరదారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశ్‌గౌడ్, నడికొప్పు నాగరాజు, రంజిత్, రాహుల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు