‘సీఎం’కు జువెనెల్‌ హోం నిర్వహణ నివేదిక

15 Nov, 2023 01:46 IST|Sakshi
ఆవిన్‌ గిడ్డంగులను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్‌
● సమర్పించిన జస్టిస్‌ చంద్రూ

సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని జువెనెల్‌ హోం, అబ్జర్వేషన్‌ కేర్‌ హోమ్‌ల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి జస్టిస్‌ చంద్రూ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్‌ నివేదికను సిద్ధం చేసింది. మంగళవారం ఈ నివేదికను సీఎం స్టాలిన్‌కు చంద్రూ అందజేశారు. రాష్ట్రంలోని జువెనల్‌ హోమ్‌, అబ్జర్వేషన్‌ కేర్‌ హోమ్‌, ప్రత్యేక గృహాల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమ ర్పించాలని ఇటీవల హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జువైనల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ కింద పనిచేసే అబ్జర్వేషన్‌ హోమ్‌, జువైనెల్‌ హోమ్‌లలో ఈ కమిటీ స్వయంగా పరిశీలించింది. ఇక్కడ చేపట్టాల్సిన పనులు, నిర్వహణ, నైపుణ్యాల మెరుగు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసింది. ఈ మేరకు నివేదికను జస్టిస్‌ చంద్రూ సిద్ధం చేశారు. దీనిని ఉదయం సచివాలయంలో సీఎం స్టాలిన్‌కు అందజేశారు.

రూ.12 కోట్లతో ఆవిన్‌కు భవనాలు

పాడి పరిశ్రమలు, డెయిరీ శాఖ నేతృత్వంలో ఈరోడ్‌లో రూ. 2.14 కోట్లతో 1500 మెట్రిక్‌ టన్ను పాడి ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు వీలుగా గిడ్డంగి నిర్మించారు. అలాగే తిరునల్వేలిలో రూ. కోటితో మహిళా పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు లైబ్రరీ, లేబొరేటరీ, హాస్టల్‌ వంటి సౌకర్యాలతో కూడిన శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ధర్మపురిలో రూ.2.72 లక్షలతో ఆవిన్‌ సంస్థకు భవనాలు, పాల సేకరణ యూనిట్‌ భవనం, రూ. 2.93 కోట్లతో తిరువణ్ణామలైలో మిల్క్‌ పౌడర్‌ ప్లాంట్‌ను నిర్మించారు. తిరుపూర్‌లో రూ. 3 కోట్లతో పాలతయారీ దారుల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశారు. మొత్తం రూ. 12 కోట్లతో వివిధ ప్రాంతాలలో నిర్మించిన భవనాలు, గిడ్డంగులను సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరన్స్‌ ద్వారా సచివాలయం నుంచి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు స్వామినాథన్‌, ఏవీ వేలు, మనో తంగరాజ్‌, సీఎస్‌శివదాస్‌ మీన తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు