మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు

6 Jun, 2023 18:41 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట జిల్లా: క్యాన్సర్‌ వ్యాధి బాధితురాలు ధరావత్‌ స్వాతి కలను తెలంగాణ పోలీసులు నెరవేర్చారు. ఒక్కరోజు ఎస్సైగా ఉండాలన్న ​స్వాతి కోరికను తీర్చారు. ఇటీవల మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసిన ఆమె.. తన కల ఎస్సై కావాలని స్పష్టం చేసింది.  దానికి స్పందించిన మంత్రి.. అందుకు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్వాతి కలను నేడు పోలీసులు నెరవేర్చారు. 

కాగా, నియోజకవర్గానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు అయిన స్వాతి అనే యువతిని ఆయన ఇటీవలే మంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శించారు.  ఎప్పటినుంచో మంత్రి జగదీష్ రెడ్డిని కలుసుకోవాలని అనుకుంటున్న యువతి కోరికను కుటుంబ సభ్యులు, వైద్యాధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు‌. వెంటనే స్పందించిన మంత్రి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయానికి స్వాతితో పాటు కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్వాతి తో ముచ్చటించిన మంత్రి మనో ధైర్యంతో ఉండాలని.. ధైర్యంగా ఉంటే ఏ రోగాలు మనల్ని ఏం చేయలేవని స్వాతికి సూచించారు. 

కుటుంబం నేపథ్యాన్ని స్వాతి పరిస్థితిని చూసిన మంత్రి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. పక్షపాతానికి గురైనటువంటి స్వాతి తండ్రి ధరావత్ చింప్లా వైద్య ఖర్చులను కూడా తానే భరించి చికిత్స చేయించేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసు అధికారి కావాలని తన జీవిత లక్ష్మామని స్వాతి మంత్రి దృష్టికికి తీసుకెళ్లింది. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కోరికను కూడా త్వరలోనే నెరవేరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు స్వాతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఏ సాయం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు‌. మంత్రి స్పందన చూసిన గిరిజన యువతి కుటుంబ సభ్యులు పట్టరాని సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. తాజాగా స్వాతి ఒక్క రోజు ఎ‍స్సైగా ఉండాలన్న కోరిక తీరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు