యాదాద్రి పవర్‌ కీర్తి కాంతులు

29 Nov, 2022 01:09 IST|Sakshi
ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సీఎస్‌ సోమేశ్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి

ప్రభుత్వ రంగంలోనే 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణం

ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌ 

పవర్‌ ప్లాంట్‌ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ 

ప్లాంట్‌ సిబ్బంది కోసం టౌన్‌షిప్‌

దామరచర్ల హైవే నుంచి ప్లాంట్‌ వరకు 7 కి.మీ పొడవున నాలుగు లేన్ల రోడ్డు 

దామరచర్ల రైల్వే స్టేషన్‌ విస్తరణ.. రైల్వే క్రాసింగ్‌ వద్ద ఆర్వోబీ 

4 గంటల పాటు ప్లాంట్‌ వద్దే సీఎం 

12వ అంతస్తులో పనుల పరిశీలన 

అధికారులతో సమీక్ష.. పలు ఆదేశాలు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ యావత్‌ దేశం కీర్తి ప్రతిçష్టలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనే పవర్‌ ప్రాజెక్టును చేపట్టామని, రాష్ట్ర రైతులు, ప్రజా శ్రేయస్సును కాంక్షించి ఇలాంటివి ప్రభుత్వ రంగంలోనే  చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో వేగం మరింత పెంచాలని, ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను ఆదేశించారు.

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులను మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పవర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన.. మొదట పవర్‌ ప్లాంట్‌ ఫేజ్‌–1, యూనిట్‌–2 బాయిలర్‌ నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న 12వ అంతస్తులో ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు.

ప్లాంట్‌ నిర్మాణం తీరుపై జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులను పరిశీలించారు. అందులోని అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరాలను తెలియజేశారు. నాలుగు గంటలకు పైగా సీఎం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 

ఉమ్మడి నల్లగొండ ప్రజలకు ఉపాధి కోసం.. 
‘ప్లాంట్‌ ఆపరేషన్‌ నిమిత్తం కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలి. ఈ ప్లాంట్‌ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన నీటిని కృష్ణా నది నుంచి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేశాం. పవర్‌ ప్లాంట్‌లో పనిచేసే దాదాపు 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్‌షిప్‌ నిర్మాణం చేపట్టాలి.

సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్‌ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలి. ఇదే ప్రాంతంలో భవిష్యత్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారు. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు 50 ఎకరాలు కేటాయించాలి. సూపర్‌ మార్కెట్, కమర్షియల్‌ కాంప్లెక్స్, క్లబ్‌ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాలి. పవర్‌ ప్లాంట్‌ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్‌ సర్వీస్‌ స్టాఫ్‌కు అవసరమైన క్వార్టర్స్‌ నిర్మించాలి.

టౌన్‌షిప్‌ నిర్మాణంలో బెస్ట్‌ టౌన్‌ ప్లానర్స్‌ సేవలను వినియోగించుకోవాలి..’ అని కేసీఆర్‌ సూచించారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్‌ ప్లాంట్‌ వరకు ఏడు కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల సీసీ రోడ్డును వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. రైల్వే క్రాసింగ్‌ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్‌ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.  

వచ్చే డిసెంబర్‌ కల్లా రెండు యూనిట్లు పూర్తి 
► 4 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌లోని ఐదు యూనిట్లలో ఒక యూనిట్‌ 2023 సెప్టెంబర్‌ నాటికి, మరొకటి డిసెంబరు నాటికి పూర్తవుతాయని ముఖ్యమంత్రికి ప్రభాకర్‌రావు వివరించారు. 2024 మార్చిలో మూడో యూనిట్, 4, 5 యూనిట్లు అదే ఏడాది జూన్‌లో పూర్తవుతాయని తెలిపారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో ఆలస్యం జరిగిందన్నారు. కాగా ప్లాంటు నిర్మాణం జరుగుతున్న తీరుపై ప్రభాకర్‌రావును సీఎం అభినందించారు. 
రైతుల సమస్యలన్నీ పరిష్కరించాలి  

► ‘యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కు భూమి ఇచ్చిన రైతులతో పాటు, గతంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు సహకరించిన రైతుల పెండింగ్‌ సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని సీఎం ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో పాటు, స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించిన ముఖ్యమంత్రి.. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్రనాయక్, కంచర్ల భూపాల్‌ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్‌ కుమార్, గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌ రెడ్డి, వెలిమినేటి సందీప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇలావుండగా సీఎం వచ్చారన్న సమాచారంతో మండలంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెంలోని భూనిర్వాసితులు పవర్‌ప్లాంట్‌ వద్దకు చేరుకుని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని, ఇంటికోఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. 

మరిన్ని వార్తలు