కాంగ్రెసోళ్లు అమ్ముడు పోరనే గ్యారంటీ ఇస్తారా? 

16 Nov, 2023 03:38 IST|Sakshi

ఆ విషయంపై మాట్లాడిన తర్వాతే ఓట్లడగాలి 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం పదవి కోసం కుమ్ములాటలు 

బీజేపీ వస్తేనే సుస్థిర ప్రభుత్వం: బండి సంజయ్‌ 

నిజాంసాగర్‌(జుక్కల్‌): ‘‘కాంగ్రెసోళ్లు ఆరు గ్యారంటీ హామీల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది.. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోరనే గ్యారంటీ ఇవ్వగలరా ? ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌కు అమ్ముడు పోయినోళ్లు.. ఈ సారి పోరనే గ్యారంటీ ఏముంది? ముందు ఈ విషయంపై మాట్లాడిన తర్వాతే ఆరు గ్యారంటీల గురించి చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు సంధించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు గెలిస్తే సీఎం పదవి కోసం కుమ్ములాటలతో మళ్లీ ఎన్నికలు రావడం తథ్యమన్నారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం బిచ్కుందలో బీజేపీ అభ్యర్థి అరుణాతారతో కలిసి సంజయ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ సీఎం అయితే హరీశ్, కవిత, సంతో ష్ రావులు ప్రభుత్వాన్ని కూల్చేస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో అందరూ సీఎంలేనని, సీఎం పదవి కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ సర్కార్‌ను కూల్చేస్తారని విమర్శించారు. బీజేపీ వస్తేనే సుస్థిర ప్రభుత్వం సాధ్యమనీ, మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎన్నికైన ఎమ్మెల్యేలు, జాతీయ నాయకత్వం కలిసి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారన్నారని చెప్పారు. 

ఒవైసీకి కేసీఆర్‌ మామ అయితడ?  
ఒవైసీకి కేసీఆర్‌ మామ అయితడ..? మామను గెలిపించాలని చెబుతున్నడు. ఎవరు మామ ? ఎవడికి మామ? పొరపాటున బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఎంఐఎంకు తాకట్టుపెడతారని బండి ధ్వజమెత్తారు. బిహార్‌లో 12 శాతం ఓట్లున్న వర్గంతో ఎంఐఎం పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. మరి తెలంగాణలో 80 శాతం ఓట్లున్న వారంతా ఏకమైతే బీజేపీని అధికారంలోకి తీసుకురాలేరా? అని ప్రశ్నించారు. 

సీఎం అంటే ఉన్న పోస్టు ఊడిపోతది 
ప్రచారంలో భాగంగా బీజేపీ యువకులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాల ర్యాలీతో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే సీఎం బండి సంజయ్‌ అంటూ పదే, పదే నినాదాలు చేయగా, మీరు సీఎం, సీఎం అంటే నా ఉన్న పోస్టు కూడా ఊడిపోతదని దయచేసి సీఎం అనకండని సంజయ్‌ సూచించారు. 

మరిన్ని వార్తలు