ఆధారాలు ఉన్నాయి; అందుకే అరెస్టు చేశాం

23 Oct, 2020 16:31 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఓటేయాలంటూ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల ప్రలోభ పెడుతున్న రేవంత్‌రెడ్డి (ఫైల్‌)

ఓటుకు కోట్లు కేసు: విచారణ ఈనెల 27కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో తదుపరి విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహా, తమ పేర్లు తొలగించాలంటూ డిశ్చార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్‌ దాఖలు చేసిన ఏసీబీ.. పిటిషన్‌లో పలు కీలక అంశాలు పొందుపరిచింది. తనను అనవసరంగా కేసులోకి లాగారన్న సండ్ర వెంకటవీరయ్య వాదనల్లో నిజం లేదని పేర్కొంది. ఈ మేరకు..‘‘2015లో గండిపేటలో జరిగిన టీడీపీ మహానాడులో నిందితులు కుట్రపన్నారు. స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టి టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించడానికి పథకం రచించారు. రేవంత్ రెడ్డి, ఇతర నిందితులతో కలిసి సండ్ర వెంకటవీరయ్య కుట్ర పన్నారు. శంషాబాద్ నోవాటెల్‌లో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్.. సండ్ర వెంకట వీరయ్యతో చర్చించారు. వీరిద్దరితో జరిపిన ఫోన్‌ కాల్స్ సండ్ర వెంకట వీరయ్య ప్రమేయాన్ని బయటపెట్టాయి. అందుకే ఆయనను అరెస్టు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశాం.

అదే విధంగా రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయ్ సింహాకు కూడా ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉంది. ఉదయ్ సింహాను నాగోలు వద్దకు రావాలని రేవంత్ రెడ్డి చెప్పారు. వేం కృష్ణ కీర్తన్ రెడ్డి నుంచి ఉదయ్ సింహా రూ.50లక్షలు తీసుకొచ్చారు. ఓటుకు నోటు కేసు రుజువు చేసేందుకు  అన్ని ఆధారాలున్నాయి’’ అని ఏసీబీ, న్యాయస్థానానికి తెలిపింది. సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేయాలని ఈ సందర్భంగా కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. (చదవండి: చంద్రబాబుది ఆరాటం.. జగన్‌గారిది నిరంతర పోరాటం)

కాగా ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.  2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు కీలక మారింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు