పేదల హక్కులు కాపాడండి

28 Oct, 2023 03:13 IST|Sakshi
యువ ఐపీఎస్‌ల గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

నూతన చట్టాలు, రాజ్యాంగ స్ఫూర్తితో విధులు చేపట్టండి 

సాంకేతికంగా మరింత పట్టు సాధించండి 

యువ ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను దేశంలోని ప్రతి పేదకు దక్కేలా చట్టాన్ని అమలు చేయాలని యువ ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర హోంమంత్రి దిశానిర్దేశం చేశారు. బ్రిటిష్‌ చట్టాలను మార్చి ప్రజల రక్షణే ధ్యేయంగా నూతన ఆశయాలు, విశ్వాసాలతో ఐపీసీ, సీఆరీ్పసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లలో కీలక మార్పులు తెస్తున్నట్లు చెప్పారు.

అతిత్వరలో రానున్న ఈ నూతన చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత యువ అధికారులపై ఉందన్నారు. బాధ్యతాయుత పోలీసింగ్‌ నుంచి ఒక అడుగు ముందుకేసి సానుకూల పోలీసింగ్‌ వైపు అడుగులు వేయాలని సూచించారు. స్థానిక భాష, ఆచార వ్యవహారాలను తెలుసుకుంటేనే యువ ఐపీఎస్‌లు సుదీర్ఘ సరీ్వస్‌లో ప్రజలకు మరింత దగ్గర అవుతారని అన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో నిర్వహించిన 75వ రెగ్యులర్‌ రిక్రూటీ ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన 155 మంది ఐపీఎస్‌లు, రాయల్‌ భూటాన్, మాల్దీవులు, మారిషస్, నేపాల్‌కు చెందిన 20 మంది విదేశీ కేడెట్ల దీక్షాంత్‌ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. 

వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను నంబర్‌ వన్‌గా నిలపాలి
‘మరో 25 ఏళ్లలో భారత్‌ వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకోనుంది. అప్పటికి 25 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకొని మీరు ఉన్నత స్థానాల్లో ఉండటమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో భారత్‌ను నంబర్‌ వన్‌గా నిలపడంలోనూ మీ శ్రమ తప్పక ఉంటుందని విశ్వసిస్తున్నా. దేశ అంతర్గత భద్రత, దేశ ప్రగతిలోనూ మీరు కీలకపాత్ర పోషించాలని ఆశిస్తున్నా’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆకాంక్షించారు.

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఆశయాలకు అనుగుణంగా గత 75 ఏళ్లలో సుశిక్షితులైన ఎందరో ఐపీఎస్‌లు దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారన్నారు. 75వ రెగ్యులర్‌ బ్యాచ్‌లోని 155 మంది ఐపీఎస్‌లలో 32 మంది మహిళా ఐపీఎస్‌లు ఉండటం మహిళా సాధికారతకు అద్దం పడుతోందని.. ఇది శుభశూచకమని అమిత్‌ షా చెప్పారు. 

కొత్త సవాళ్లకు సిద్ధం కావాలి.. 
ఇటీవల కాలంలో పెరిగిన సైబర్‌ నేరాలు, అంతర్గత భద్రత ముప్పు, అంతర్జాతీయ ఆర్థిక నేరాలు, హవాలా, క్రిప్టోకరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, డ్రగ్స్‌ రవాణా వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐపీఎస్‌లు మరింత సిద్ధం కావాలని అమిత్‌ షా సూచించారు. సైబర్‌ నేరాల కట్టడికి పోలీసులు ఎప్పుడూ రెండు అడుగులు ముందే ఉండేలా సాంకేతికంగా పోలీసింగ్‌ బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు.

అకాడమీ డైరెక్టర్‌ అమిత్‌ గార్గ్‌ మాట్లాడుతూ యువ ఐపీఎస్‌లు చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయడంతోపాటు మానవతా విలువలతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా, సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్, ఐబీ డైరెక్టర్‌ తపన్‌ డేకా, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఆరోగ్యంతోనే అన్నీ..  
ఫిట్‌రైజ్‌ 75 ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా  శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా ఉల్లాసంగా ఉంటామని, పూర్తి శక్తిసామర్థ్యాలతో పనిచేయగలుగుతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. ఫిట్‌నెస్‌ సాధించేందుకు తాను నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. దీక్షాంత్‌ పరేడ్‌ అనంతరం ఎన్‌పీఏ ఆవరణలో ఫిట్‌రైజ్‌–75ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యోగా, ధ్యానం, శారీరక శ్రమ మానసిక ధృఢత్వాన్ని, ఆలోచన శక్తిని పెంచుతుందన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు