-

Minister KTR: కాంగ్రెస్‌ జాబ్‌ కేలండర్‌ పెద్దజోక్‌.. ప్రజలను ఏప్రిల్‌ ఫూల్స్‌ చేయడమే

27 Nov, 2023 08:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తన ఉద్యోగం కోసం యువతను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన జాబ్‌ కేలండర్‌ పెద్ద జోక్‌. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ఉంటుందని తెలిసీ ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పడం ప్రజలను ఏప్రిల్‌ ఫూల్స్‌ చేయడమే, అది పప్పూ కేలండర్‌’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా నేటికీ ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. తెలంగాణలో గత పదేళ్లలో ఏటా సగటున 16 వేల చొప్పున 1.60లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు సగటున ఏటా వేయి ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది’అని చెప్పారు. రాహుల్, రేవంత్‌రెడ్డి ఏనాడైనా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసి పరీక్షలు రాశారా అని ప్రశ్నించారు.

కేటీఆర్‌.. పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. డిసెంబర్‌ 4న తానే స్వయంగా అశోక్‌నగర్‌కు అధికారులతోపాటు వెళ్లి యువతతో సమావేశమై జాబ్‌ కేలండర్‌ను రూపొందిస్తామని ప్రకటించారు.  
చదవండి: రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో?

29న దీక్షా దివస్‌ 
‘స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తన నిరాహార దీక్షతో తెలంగాణ జాతిని ఏకం చేసిన కేసీఆర్‌ నవంబర్‌ 29 దీక్షతో ఉద్యమ చరిత్రను మలుపు తిప్పారు. ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టండి అని చెప్పిన ధీశాలి కేసీఆర్‌. ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్‌ చేసిన దీక్ష తెలంగాణ సమాజంలో సబ్బండ వర్గాలను కదిలించింది. ఢిల్లీ మెడలు వంచడంలో కీలకమైన నవంబర్‌ 29న పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగరాలి.

అనేక రాజకీయ పార్టీలు వచ్చి కనుమరుగైనా ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌దే. 14 ఏళ్లుగా దీక్షా దివస్‌ జరుపుకుంటున్న రీతిలోనే నవంబర్‌ 29న అమరుల త్యాగాలు, కేసీఆర్‌ పోరాట స్ఫూర్తిని మరోమారు తెలియజేయాలి. విముక్తి పోరాటంలో సమున్నత సందర్భాన్ని చాటేలా దేశ విదేశాల్లో దీక్షా దివస్‌ నిర్వహించాలి. అమరుడు శ్రీకాంతాచారిని స్మరించుకుంటూ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూల మాలలు వేయాలి’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

బీజేపీతో రేవంత్‌ లోపాయికారీ ఒప్పందం 
‘ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి లేదు. ఆయనకు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉంది. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీపై కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. గతంలో బీజేపీ గెలుచుకున్న గోషామహల్‌తోపాటు కరీంనగర్, కోరుట్లలో కూడా బీఆర్‌ఎస్‌ గెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు దక్కకుండా గెలిచి తీరుతాం. రైతుబంధు కొత్త పథకం కాకపోయినా అభ్యంతరం చెబుతున్న రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి కిసాన్‌ యోజన డబ్బుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు.

ఐటీ దాడులు అన్ని పార్టీల నేతల మీద జరుగుతున్నా కేవలం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారని రేవంత్‌ చెప్పడం విడ్డూరం. బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్, తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో కేసీఆర్‌కు బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉంది’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు