‘కేడర్‌ వివాదం’లో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి

13 Dec, 2023 05:17 IST|Sakshi

ఆ మేరకు ఆదేశాలిస్తాం

క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తాం: హైకోర్టు 

అలా కాకుండా కేసుల వారీగా విచారణ జరపాలి: పిటిషనర్లు 

వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సర్వీస్‌ (ఏఐఎస్‌) అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్‌ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించనందున.. క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపును మరోసారి పరిశీలించి పదేళ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న వారు, త్వరలో సర్విస్‌ ముగిసేవారికి సంబంధించి సహేతుక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది.

అయితే అలా వద్దని పిటిషన్‌ వారీగా విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్‌ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 

2014 నుంచి కొనసాగుతున్న కేడర్‌ వివాదం 
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్‌ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్‌ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు.

క్యాట్‌ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సర్వీస్‌ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్‌ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్లపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం అలా నిర్ణయా న్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటి షన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమరి్థంచారు. దీంతో తదుపరి విచారణ కోసం ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు