రైతుకు మిగిలేది నెలకు 1,697 రూపాయలే

10 Dec, 2021 01:25 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

రాష్ట్ర సన్న చిన్నకారు రైతుల ఆదాయం అంతంతే 

రాష్ట్రంలో 88.25% మంది ఈ తరహా వారే

వీరి సగటు రాబడి నెలకు రూ.9,403

ఇందులో పంట ఉత్పత్తులు, పశువుల కోసం అయ్యే వ్యయం రూ.7,706

ఆదాయంలో దేశంలో 25వ స్థానంలో తెలంగాణ రైతాంగం మేఘాలయ రైతులకు అత్యధికంగా రూ.29,348 ఆదాయం

కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: పంటలు సాగు చేయడమే కష్టం. అష్టకష్టాలు పడి సాగు చేసినా పంట చేతికొచ్చేదాకా అనుమానమే. అన్ని పరిస్థితులూ అనుకూలించినా, తీరా అమ్ముకుందామనుకే సరికి గిట్టుబాటు ధర లభించడం గగనమవుతోంది. మొత్తంగా సగటు రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. తెలంగాణలో ఒక సాధారణ ఔట్‌సోర్సింగ్‌ అటెండర్‌ నెలసరి వేతనం కంటే, సన్న, చిన్నకారు రైతు ఆదాయం తక్కువ గా ఉండటం బాధాకరం. వివిధ రాష్ట్రాల్లో రైతుల నెలసరి సరాసరి ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. జూలై 2018 నుంచి జూన్‌ 2019 మధ్య చేసిన సర్వే ఆధారంగా ఆదాయాలను లెక్క గట్టింది. ఆ వివరాలను ఇటీవల లోక్‌సభలోనూ వెల్లడించింది. ఆ వివరాలను చూస్తే మన రాష్ట్ర రైతుకు ఖర్చులు పోనూ నెలకు సగటున రూ.1,697 ఆదాయమే లభిస్తోందని స్పష్టమవుతోంది. 

రాష్ట్రంలో 59.48 లక్షల మంది రైతులు 
2021–22కు సంబంధించి వ్యవసాయ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణలో 59.48 లక్షల మంది రైతులున్నారు. వారి చేతిలో 1.54 కోట్ల ఎకరాల భూమి ఉంది. కనీసం ఎకరంబావు నుంచి రెండున్నర ఎకరాల వరకు భూమి కలిగిన సన్నకారు రైతులు 38.40 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం రైతుల్లో 64.56 శాతం మంది వీరేనన్నమాట. ఇక రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూమి కలిగిన చిన్నకారు రైతులు 14.09 లక్షల మంది అంటే 23.69 శాతం మంది ఉన్నారు. ఐదెకరాల నుంచి పదెకరాలున్న రైతులు 5.64 లక్షల మంది, పదెకరాల నుంచి 25 ఎకరాల వరకు భూమి కలిగినవారు 1.26 లక్షల మంది, 25 ఎకరాలకు పైగా భూమి కలిగినవారు 9 వేల మంది ఉన్నారు. అంటే ఎకరంబావు నుంచి ఐదెకరాల వరకు భూ మి కలిగిన సన్న చిన్నకారు రైతులే 88.25 శాతం మంది ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఒక ఔట్‌సోర్సింగ్‌ అ టెండర్‌ నెలసరి కనీస జీతం రూ. 15,600. కా గా రైతు నెలసరి ఆదాయం సరాసరి రూ.9,403 మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్థాయిలో తక్కువగా ఆదాయం పొందుతున్నవారంతా సన్న చిన్నకారు రైతులేనని అనుకోవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర రైతులు నెలసరి ఆదాయంలో దేశంలో 25వ స్థానంలో ఉండటం గమనార్హం. అత్యధికంగా మేఘాలయ రైతులు నెలకు రూ.29,348 పొందుతున్నారు. కాగా జాతీయ సగటు ఆదాయం రూ.10,218 గా ఉంది. 

ఇదీ లెక్క..
మన రాష్ట్ర రైతులు పొందుతున్న నెలసరి ఆదాయం (రూ.9,403)లో పంట ఉత్పత్తుల కోసం చేస్తున్న ఖర్చే నెలకు రూ. 6,543గా ఉంది. ఇక పశువుల కోసం నెలకు రూ.1,163 వెచ్చిస్తున్నారు. ఇవి రెండూ కలిపి మొత్తం రూ.7,706 వ్యయం అవుతోంది. అంటే రైతు కుటుంబ ఖర్చులకు నెలకు మిగిలేది సరాసరి రూ.1,697 మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు