'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!

13 Nov, 2023 08:01 IST|Sakshi

సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి. టిక్కెట్స్ ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చెప్పినా.. ఎప్పటిలాగే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రహసనం సాగింది. కొన్ని చోట్ల సీనియర్లకే పార్టీ హైకమాండ్‌ ఝలక్ ఇచ్చింది. 20 మందికి పైగా అప్పటికప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి టిక్కెట్లు తీసేసుకున్నారు. ఇలా ఉంటది కాంగ్రెస్‌తోని.. సీట్ల గందరగోళం ఎలా ఉందో ఓసారి చూద్దాం.'

ఆశావహుల్లో టెన్షన్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా మందే అభ్యర్థులను ఖరారు చేసేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎప్పుడూ చేసే విధంగానే చివరి నిమిషం వరకు ఆశావహుల్లో టెన్షన్ పెంచింది. నల్గొండ జిల్లా మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి మెదక్ నియోజకవర్గాల్లో మైనంపల్లి హనుమంతరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి వంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అతి విచిత్రంగా జరిగింది.

వీరంతా అప్పటికప్పుడు పార్టీలో చేరి అభ్యర్థులైపోయారు. ఇలాంటి నాయకులు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే. పార్టీ అధికారంలో లేనపుడు బయటకు వెళ్ళిపోయి.. ఇప్పుడు అధికారం వస్తుందన్న ఆశతో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన నేతలు ఇటువంటి వారిని చూసి హతావులవుతున్నారు. మొత్తానికి నాలుగు విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది.

జాబితాల ప్రకటించడానికి ముందు పదుల సంఖ్యలో ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగాయి. ఆశావాహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్దం అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్‌లో మూడు సార్లు కూర్చోని ఆశావహుల జాబితాను ఫిల్టర్ చేసింది. ఇక ఆ తర్వాత కథ అంతా ఢిల్లీలోనే నడిచింది. టిక్కెట్లు ఆశించిన నేతలు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. టిక్కెట్ దక్కినవారు సంబరాలు చేసుకుంటూ తిరిగివచ్చారు. ఆశాభంగం పొందినవారు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్‌ చేరాక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు.

కొత్తగా వారికే ఎక్కువగా అవకాశం..
మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చాలా మంది సీనియర్లకు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. ఇక రెండో జాబితా ప్రకటించాక మాత్రం టిక్కెట్ రాని నేతలు నానా యాగీ చేసారు. చాలా మంది నేతలు గాంధీ భవన్ ముందే తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చివరికి గాంధీ భవన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీలో టాక్ నడుస్తోంది.

గెలుపే లక్ష్యంగా  అభ్యర్థుల పేర్లను సునీల్ సిఫార్సు చేసారట. దీంతో చాలా సెగ్మెంట్లలో నేతల మధ్య గొడవలకు దారితీసాయని చెబుతున్నారు. దీంతో పాటు అసలు దరఖాస్తు చేయని నేతలకు టిక్కెట్ ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కొత్తగా వచ్చిన వారికి వెంటనే టిక్కెట్లు ఇవ్వడం పార్టీలో అశాంతికి కారణం అయింది. పార్టీలో టిక్కెట్లు అమ్ముకున్నారనే తీవ్ర ఆరోపణలు, దానిపై చర్చకు అప్పటికప్పుడు వచ్చినవారికి సీట్లు ఇవ్వడమే కారణం కావచ్చు.

చివరి నిమిషం వరకు ఉత్కంఠ..!
ఇక అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చడంతో పెద్ద దుమారమే రేపింది. వనపర్తి, బోధ్, పటాన్‌చెరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చారు. ఇలా మార్చడానికి సునీల్ కనుగోలు ఒక కారణం అయితే.. నేతల ఒత్తిడి మరో కారణం అంటున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో మూడు స్థానాల అభ్యర్థులను చివరి రోజు వరకు సాగదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. సూర్యాపేట విషయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించడంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌ను కాదని మందుల సామ్యూల్కి టిక్కెట్ దక్కేలా చేయడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారు.

అయితే అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తన మనుషులకు ఇప్పించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. నల్లగొండలో మాత్రం ఫెయిలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, ఓబీసీ, ఎస్టి సెల్లకు టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 119 సీట్లలో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించగా మిగిలిన 118 సీట్ల లో 22 స్థానాలు బీసీలకు, 31 స్థానలు ఎస్సీ, ఎస్టిలకు, 65 స్థానాలు ఓసిలకు ఇచ్చారు. బీసీలకు 30 కి పైగా ఇవ్వాలని కాంగ్రెస్ మొదట భావించినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో అది సాధ్యం కాలేదు.

మరిన్ని వార్తలు