సెకండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరం

17 Apr, 2021 10:05 IST|Sakshi

గంటల వ్యవధిలో వైరస్‌ లోడ్‌ కమ్యూనిటీ స్ప్రెడ్‌ అయ్యింది

  మూడు నెలలు కొనసాగే అవకాశం

  నిబంధనలు పాటిస్తే నియంత్రణ సాధ్యం   

సాక్షి, గాంధీఆస్పత్రి: కరోనా సెకెండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరంగా మారి, కమ్యూనిటీ స్ప్రెడ్‌ అయ్యిందని, ఈ తరుణంలో లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూలతో పెద్దగా ఫలితాలు ఉండవని, ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను నియంత్రించవచ్చని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చామని, ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా రోగులను మాత్రమే ఇకపై గాంధీలో చేర్చుకుంటామన్నారు. మొదటి వేవ్‌లో కరోనా సోకిన రెండు, మూడు రోజులకు శరీరంలో వైరస్‌ లోడ్‌ పెరిగేదని, సెకెండ్‌ వేవ్‌లో కేవలం గంటల వ్యవధిలో పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.
 
ఊపిరితిత్తులపై ఎటాక్‌.. 
సెకండ్‌వేవ్‌ మరో మూడు నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణులు అంచనాకు వచ్చారని తెలిపారు. సెకెండ్‌వేవ్‌లో రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ మానవ శరీరంలోని లీవర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నారు. శరీరంలో చేరిన వైరస్‌ రక్త ప్రసరణకు అడ్డుపడటంతో పెద్దసంఖ్యలో బాధితులు పక్షవాతానికి(పెరాలసిస్‌)కు గురవుతున్నారని, ఊపిరితిత్తులపై ఎటాక్‌ చేయడంతో శ్వాస అందక ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారని వివరించారు.

గాంధీలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పడకలతోపాటు నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, మందుల కొరత లేదన్నారు. కోవిడ్‌ బాధితులతో సహాయకులను ఆస్పత్రిలోకి అనుమతించమని స్పష్టం చేశారు. గత ఘటనలు, అనుభవాలను పాఠాలుగా తీసుకుని మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, కోవిడ్‌ నిబంధనలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.  

కోవిడ్‌ టీకా సెంటర్‌ కొనసాగుతుంది 
గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంఓ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ టీకా సెంటర్‌ కొనసాగుతుందని సూపరింటెండెంట్‌ రాజారావు స్పష్టం చేశారు. ప్రధాన ద్వారం నుంచి కోవిడ్‌ బాధితులు, అంబులెన్స్‌లు రాకపోకలు సాగిస్తాయని, ఆర్‌ఎంఓ క్వార్టర్స్‌ ఎదురుగా ఉన్న గేట్‌ను శనివారం నుంచి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆస్పత్రి ప్రధాన భవన సముదాయానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ దూరంగా ఉండటంతో టీకా కోసం వచ్చేవారు ఎటువంటి భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ ఆదేశాల మేరకు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సీఐ నరేష్‌ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు.

( చదవండి: జర జాగ్రత్త: వ్యాక్సిన్‌ కోసం వెళితే మొదటికే ముప్పు!

మరిన్ని వార్తలు