Plastic Toys: అమ్మో ‘ప్లాస్టిక్‌ బొమ్మ’.. 

17 Apr, 2021 09:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్లాస్టిక్‌ బొమ్మల్లోని రసాయనాలతో పారాహుషార్‌ 

బొమ్మల్లో వాడే 419 రసాయనాల్లో 126 ప్రాణాంతకమైనవిగా గుర్తింపు 

ఫ్లేమ్‌ రిటార్డెంట్‌ రసాయనంతో చిన్నారుల్లో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 

బ్రోమినెడెట్‌ ఫ్లేమ్‌ రసాయనంతో పిల్లల్లో ఐక్యూ తగ్గే అవకాశం 

బొమ్మల్లోని రసాయనాలతో చిన్నారుల వ్యవహారశైలిలో మార్పు  

ప్లాస్టిక్‌ బొమ్మలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు 

సాక్షి, న్యూఢిల్లీ: మీ చిన్నారులు ఎక్కువ సమయం బొమ్మలతో ఆడుకుంటున్నారా..? ఆటల్లో భాగంగా బొమ్మలను నోట్లో పెట్టుకోవడం వంటివి చేస్తున్నారా...? అయితే మీరు ఇప్పటికైనా పిల్లల అలవాట్లను మార్చాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే కరోనా కారణంగా ఏడాదిగా స్కూళ్ళకు తాళం పడడంతో, చదువులంతా ఆన్‌లైన్‌లో అయిపోయేసరికి రోజంతా చిన్నారులు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఆన్‌లైన్‌ క్లాసులు అయిపోయిన తరువాత ఖాళీ సమయం టీవీ చూడడం, బొమ్మలు వారికి వినోదంగా మారాయి. అయితే చిన్నారులు ఎక్కువగా రోజంతా తమతో పాటే ఉంచుకొనే బొమ్మల విషయంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరు జాగ్రత్త పడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.

అంతేగాక శిశువుల చేతికి ప్లాస్టిక్‌ బొమ్మలను అందించే మీ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఆడుకొనే బొమ్మల విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఏమేరకు ఉన్నాయనే విషయంలో ఆందోళన వ్యక్తమౌతూనే ఉంది. ఇదేమీ కేవలం మన దేశంలోని సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు ఆడుకొనే ప్లాస్టిక్‌ బొమ్మలు, సాఫ్ట్‌ టాయ్స్‌ ఏ మేరకు సురక్షితం అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక అంతర్జాతీయ అధ్యయనంలో, బొమ్మల తయారీలో వాడే రసాయనాల్లో సుమారు 100కు పైగా ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.  

హార్డ్, సాఫ్ట్, ఫోం బేస్డ్‌ ప్లాస్టిక్‌తో తయారుచేసిన బొమ్మల్లో సుమారు 419 రసాయనాలు లభించాయని డెన్మార్క్‌ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు పీటర్‌ తెలిపారు. వీటిలోని 126 రసాయనాల కారణంగా చిన్నారుల్లో క్యాన్సర్‌ వంటి అనేక వ్యాధులు వచ్చేందుకు కారణమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. పిల్లలు ఉపయోగించే బొమ్మల్లో ఉండే ప్రాణాంతకమైన ఫ్లేమ్‌ రిటార్డెంట్‌ రసాయనంతో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గతంలో ప్రకటించారు. ఈ ప్రమాదం చిన్నారులు ఇటీవల ఎక్కువగా ఆడుకొనే పాలిస్టర్‌ టన్నెల్‌తో కూడా ఉందని అధ్యయనం గుర్తించింది. పాలిస్టర్‌ టన్నెల్‌ తయారీలో వినియోగించిన మెటీరియల్‌లో ఫ్లేమ్‌ రిటార్డెంట్‌ రసాయనం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.  

వాణిజ్య, వినియోగదారు ఉత్పత్తులలో ఫ్లేమ్‌ రిటార్డెంట్‌ రసాయన వాడకం 1970 లో ఫ్లేమ్‌ ఎబిలిటీ స్టాండర్డ్‌తో ప్రారంభమైంది. అయితే మార్కెట్లో లభించే ఫ్లేమ్‌ రిటార్డెంట్‌ రసాయనంతో తయారైన అన్ని ఉత్పత్తులతో ఆరోగ్యపరంగా ప్రమాదం ఉండదని, ఈ రసాయనంతో క్లోరిన్, బ్రోమైడ్‌ , భాస్వరం రసాయనాలు కలిసి ఉన్న త్పత్తులతో ప్రమాదం ఉందని గుర్తించారు. ఫర్నిచర్, పిల్లల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, భవన నిర్మాణ సామగ్రి, దుస్తులు, కారు సీట్లు , వాహనాల లోపలి భాగాల తయారీలో ఫ్లేమ్‌ రిటార్డెంట్‌ ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లో ఉన్న రసాయనం నేరుగా చర్మంలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో పాటు, దుమ్ములో పేరుకుపోవచ్చని తెలిపారు. ఒక పరిశోధనలో ఫ్లేమ్‌ రిటార్డెంట్‌ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

అంతేగాక బ్రోమినేటెడ్‌ రసాయనంతో క్యాన్సర్, హార్మోన్‌ల్లో తేడాలు, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావంతో పాటు న్యూరో డెవలప్మెంట్‌ సమస్యలు కూడా వస్తాయని పేర్కొన్నారు. కొద్దిమంది చిన్నారులపై నిర్వహించిన పరిశోధనలో ఈ రసాయనం కారణంగా పిల్లల్లో ఐక్యూ లెవల్స్‌ తగ్గుతాయని, పిల్లల ప్రవర్తన, వ్యవహార శైలిలో మార్పు వస్తుందని గుర్తించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక పరిశోధనలో చిన్నారుల్లో ఐక్యూ నష్టానికి బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ అతిపెద్ద కారణమని తేలింది. అంతేగాక ఇది పిల్లల్లో మేధో వైకల్యాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంతేగాక ఇటీవల శిశువుల ఉత్పత్తులు, కౌచ్‌ల్లో క్లోరినేట్‌ ట్రీ రసాయనం ఉన్నట్లు కనుగొన్నారు. 40 ఏళ్ళ క్రితం మాన్యుఫాక్చరర్‌లు ఈ రసాయనాన్ని వాడటం మానేసినప్పటికీ, తరువాత దీనిని మళ్లీ ఉపయోగించడం ప్రారంభించినట్లు తాజా పరిశోధనల్లో తేలింది. 

క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(క్యూసిఐ) 2019 లో దిగుమతి చేసుకున్న కొన్ని బొమ్మలను పరీక్షించింది. 121 రకాల బొమ్మలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపగా, అందులో 66.90% బొమ్మలు పరీక్షల్లో ఫెయిల్‌కాగా, 33.1% బొమ్మలు మాత్రమే నాణ్యతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి. పరీక్షలు జరిపిన బొమ్మలలో 30% ప్లాస్టిక్‌ బొమ్మలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వీటిలో సీసం వంటి హెవీ మెటల్‌ కంటెంట్‌ ఉందని గుర్తించారు. 80% ప్లాస్టిక్‌ బొమ్మలు మెకానికల్, ఫిజికల్‌ భద్రతా ప్రమాణాల విషయంలో విఫలమయ్యాయి.

అంతేగాక రీసైకిల్‌ ప్లాస్టిక్‌తో చేసిన అన్ని బొమ్మలలో చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరమైన డయాక్సిన్‌ రసాయనం చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. బొమ్మలలో ఇది 690 ప్రతి గ్రాము టిఎఫ్‌క్యూ (టాక్సిక్‌ ఈక్వివలెంట్‌ కోషెంట్‌) ఉందని తేలింది. పిల్లలు తీవ్రమైన వ్యాధుల బారిన పడేందుకు కారణమైన బ్రోమినేటెడ్‌ డయాక్సిన్‌ రసాయనం సైతం ఈ బొమ్మల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.  

పిల్లలను ఎలా రక్షించాలి? 
ఈ రసాయనాల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్లాస్టిక్‌ బొమ్మలు కొనడం తగ్గించడం తో పాటు, వారిని ప్లాస్టిక్‌ బొమ్మలకు దూరం గా ఉంచడమే సులభమైన మార్గం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, విదేశాలలో ఉన్న పిల్ల లు ప్రతి సంవత్సరం సగటున 18.3 కిలోగ్రాముల ప్లాస్టిక్‌ బొమ్మలను కొనుగోలు చేయ డం కానీ జమ చేయడం కానీ చేస్తారు. అవస రాని కంటే ఎక్కువ బొమ్మలు కలిగి ఉన్న పిల్లలతో పోలిస్తే, తక్కువ బొమ్మలు ఉన్న పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకతలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.  

మరిన్ని వార్తలు