81 శాతం మందికి కరోనా సోకే అవకాశం

30 Jul, 2020 19:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వ పటిష్టమైన చర్యలకు తీసుకుంటోందని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వైరస్‌కు భయపడాల్సిన పనిలేదని, ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా కట్టడి చేయడంలో కొంతమేర విజయం సాధించామని పేర్కొన్నారు. కరోనా పరీక్షలు, బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై గురువారం సాయంత్రం ఆయన సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వైరస్‌ అంత తక్కువ సమయంలో తగ్గే అవకాశం లేదని, సహజీవనం చేస్తూ ముందుకెళ్లాల్సిందేనని చెప్పారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులతోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈటల అభిప్రాయపడ్డారు. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు సాయం మాత్రమే చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. (క‌రోనా: 10 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు)

ఇక వైరస్‌ ప్రభావం చూస్తుంటే 81శాతం మందికి కరోనా వచ్చి, పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెప్పారని మంత్రి స్పష్టం చేశారు. అలాగే వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ టెస్టులు చేస్తున్నామని, మొబైల్‌ టెస్ట్‌ లేబొరేటరీల ద్వారం పరీక్షల నిర్వహణ ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు. కరోనా విషయంలో విపక్షాలు కావాలనే రచ్చ చేస్తున్నాయని, దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని, ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని తెలిపారు. దేశ ‍వ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, కోల్‌కల్తా, చెన్నై వంటి పెద్ద నగరాల్లో కేసుల సంఖ్య విపరీతంగా ఉందని, హైదరాబాద్‌లోనూ అదే రీతిలో ఉందని చెప్పుకొచ్చారు. అయితే పరీక్షల సంఖ్యను పెంచడంతో కొంతమేర కట్టడి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. (ఆగస్ట్‌ 10లోపు కరోనా వ్యాక్సిన్‌!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు