సాఫీగా కోవాక్జిన్‌‌ ట్రయల్స్‌

4 Aug, 2020 02:10 IST|Sakshi

ముగింపునకు తొలి దశ

మొత్తం యాభై ఐదు మందికి కొవాక్జిన్‌ టీకా 

వారిలో ఇద్దరికి బూస్టర్‌ డోస్‌ ∙ఎవరిలోనూ కనిపించని సైడ్‌ ఎఫెక్ట్స్‌

వ్యాక్సిన్‌ పనితీరు తేలేది నెల తర్వాతే

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌) : నిజామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో కోవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ వ్యాక్సిన్‌ ప్రయోగం ముగింపు దశకు చేరుకుంది. సోమవారం మరో ఇద్దరికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా 55 మంది వలంటీర్లు ఈ టీకాలు వేయించుకున్నారు. వీరిలో ఇద్దరికి మొదటి దశలోని మలి టీకా (బూస్టర్‌ డోస్‌)ను కూడా ఇచ్చారు. మరో రెండురోజుల్లో మిగిలిన మరో ఐదుగురికి టీకాలు వేస్తే నిమ్స్‌లో మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ముగుస్తాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాక్జిన్‌ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియకు ఐసీఎంఆర్‌ మొత్తం దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఇందులో నిమ్స్‌ ఒకటి. నిమ్స్‌లో జూలై 14న ప్రారంభమైన క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రణాళిక ప్రకారం సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటివరకు టీకా తీసుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ టీకా వల్ల ఎవరిలోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించకపోవడం గమనార్హం. నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ కె. మనోహర్‌ పర్యవేక్షణలో నోడల్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి. ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌ పనితీరు ఎలా ఉందనేది మరో నెల తర్వాతే నిర్ధారణ అవుతుందన్న అభిప్రాయాన్ని నిమ్స్‌ వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. 

టీకా ‍ప్రయోగం ఇలా..
వలంటీర్లకు తొలుత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రక్త నమూనాలు, స్వాబ్‌లను సేకరిస్తున్నారు. ఆ నమూనాలను ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన ఢిల్లీలోని ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఢిల్లీ ల్యాబ్‌ జారీ చేసిన ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ల ఆధారంగా నిమ్స్‌ వైద్యులు టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి దశలో 3 మైక్రోగ్రాములు మోతాదులో టీకా ఇస్తున్నారు. ఇప్పటికి 55 మందికి వేశారు. ఈ టీకా తీసుకున్న వలంటీర్లకు 14 రోజుల తర్వాత అదే కోడ్‌ కలిగిన వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ను అందిస్తున్నారు.
సోమవారం నుంచి ఈ డోస్‌ను కూడా నిమ్స్‌ వైద్యులు ప్రారంభించారు.ఈ క్రమంలో ఫోన్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వలంటీర్ల ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం తెలుసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు