ఫామ్‌హౌస్‌లపై విజిలెన్స్‌!

23 Jan, 2024 04:41 IST|Sakshi

పంటసాగు ముసుగులో కరెంట్‌ చౌర్యం

వ్యవసాయ బోర్లు.. నీటివ్యాపారాలకు అడ్డాలు

పెద్ద మొత్తంలో ఆదాయాన్నికోల్పోతున్న విద్యుత్‌ సంస్థ

కనెక్షన్ల వారీగా సర్వే..అక్రమార్కులపై కేసులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఫామ్‌హౌస్‌ల ముసుగులో కరెంట్‌ చౌర్యానికి పాల్పడుతున్న అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలు, వాటిలోని విద్యుత్‌ బోర్లు, భారీ నిర్మాణాలు, రిసార్టులు, క్రీడా మైదానాలు, క్లబ్‌ హౌస్‌ల్లో విద్యుత్‌ విజిలెన్స్‌ బృందాలు తనిఖీలు ప్రారంభించాయి.

వాటికి సరఫరా అవుతున్న కరెంట్‌పై ఆరా తీయడంతోపాటు వ్యవసాయం ముసుగులో కరెంట్‌ దోపిడీకి పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు సంస్థకు వాటిల్లిన నష్టాలను జరిమానా రూపంలో తిరిగి రాబట్టడమే కాకుండా ఆయా వినియోగదారులకు లోడును బట్టి మీటర్లు కూడా జారీ చేస్తున్నారు. 

సాగు ముసుగులో వ్యాపారాలు 
హైదరాబాద్‌ శివార్లలో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు పెద్దఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. వాటి చుట్టూ భారీ ప్రహరీలు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. కొంతమంది వాటిలో పండ్లు, కూరగాయలు, పూలతోటలు సాగు చేస్తుండగా, మరికొంత మంది ఫామ్‌హౌస్‌ పేరుతో విలాసవంతమైన భవనాలు నిర్మించి సినిమా షూటింగ్‌లు, బర్త్‌డే పార్టీలు, వీకెండ్‌ పార్టీలకు అద్దెకు ఇస్తున్నారు.

మరికొంతమంది ఏకంగా రిసార్ట్‌లు, క్లబ్‌ హౌస్‌ లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు కల్పించిన ఉచిత విద్యుత్‌ సదుపాయా న్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కొంతమందైతే ఏకంగా బోర్ల నుంచి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా హోటళ్లు, వసతి గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు సరఫరా చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పంటసా గు ముసుగులో కరెంట్‌ చౌర్యానికీ పాల్పడుతున్నారు. ఫలి తంగా డిస్కం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతోంది.  

సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే.. 
గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో మొత్తం 61,40,795 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో 50,99,190 గృహ, 8,22,821 వాణిజ్య, 36,440 పారిశ్రామిక, 1,82,344 ఇతర (వ్యవసాయ కనెక్షన్లు రంగారెడ్డి జిల్లాలో 1,17,417 ఉండగా, మేడ్చల్‌లో 21,491 వరకు) కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2,500 మెగావాట్ల విద్యుత్‌ వినియోగమవుతోంది. వేసవిలో ఈ డిమాండ్‌ 3800 నుంచి 4000 మెగావాట్లు దాటుతోంది.

అయితే డిస్కం సరఫరా చేస్తున్న విద్యుత్‌కు, మీటర్‌ రీడింగ్‌ నమోదు ద్వారా నెలవారీగా సంస్థకు వస్తున్న బిల్లులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇప్పటికే గృహ, వాణిజ్య కనెక్షన్లపై అంతర్గత తనిఖీలు చేపట్టిన డిస్కం తాజాగా వ్యవసాయ కనెక్షన్లపైనా ఆరా తీస్తోంది. దీంతో అధికారులు సర్కిళ్ల వారీగా విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేయిస్తున్నారు. 

డీఈకి షోకాజ్‌ నోటీసులు 
ఇటీవల డిస్కం సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్‌ అధికారి ముషారఫ్‌ ఫరూఖీ నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పాటు అంతర్గత నష్టాలపై ప్రధానంగా దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లను పరుగెత్తించడంతో పాటు ఆయ న కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులకు స్పందించని ఇంజనీర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గచ్చిబౌలి డీఈ సహా పలువురు ఇంజనీర్లకు షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల ముసుగులో ఏళ్ల తరబడి విద్యుత్‌ బిల్లులు చెల్లించకుండా పెద్ద మొత్తంలో బిల్లుల ఎగవేతకు పాల్పడిన యూనియన్లపై కూడా ఫోకస్‌ పెట్టినట్లు తెలిసింది. డిస్కం సరఫరా చేస్తున్న ప్రతీ యూనిట్‌ను పక్కాగా లెక్కించేందుకు ఫీడర్లకు సెన్సర్లను ఏర్పాటు చేసే యోచనలో సీఎండీ ఉన్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు