174 మంది విద్యార్థులు.. రూ. 61.27 లక్షలు 

3 Jan, 2024 03:34 IST|Sakshi
మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలోని ఓ పాఠశాలలో బ్యాక్‌ టు స్కూల్‌ కిట్లను అందుకున్న విద్యార్థులు

గ్రామీణ పేద విద్యార్థుల కోసం ‘చిరేక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ విద్యార్థుల విరాళం

క్లౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫాం ‘ఫ్యూయల్‌ ఎ డ్రీమ్‌’ ద్వారా సేకరణ   

రాయదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు కొండాపూర్‌లోని చిరేక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు నడుం బిగించారు. అందుకోసం ‘క్లౌడ్‌ ఫండింగ్‌ ఫ్లాట్‌ఫాం ఫ్యూయల్‌ ఎ డ్రీమ్‌ డాట్‌కామ్‌’ద్వారా నిధులను సేకరించారు. పాఠశాలకు చెందిన 174 మంది విద్యార్థులు స్వచ్చందంగా ముందుకొచ్చి మూడు వారాల్లోనే రూ.61.27 లక్షలు సేకరించడం విశేషం.

తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలలో చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాక్‌–టు–స్కూల్‌ కిట్‌ను అందించడమే లక్ష్యంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కిట్‌కోసం సంవత్సరానికి రూ.900 ఖర్చవుతుంది. గ్రీన్‌సోల్‌ అనే ఎన్‌జీఓ సహకారంతో ఈ కిట్‌ను తయారు చేయించారు. చిరేక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ప్రతి విద్యార్థి రూ.27వేలు సేకరించడం లక్ష్యం. దీంతో 30 మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే 174 మంది విద్యార్థులు రూ.61.27 లక్షలను సేకరించడంతో 6,800 మంది విద్యార్థులకు మేలు జరగనుంది.

>
మరిన్ని వార్తలు