సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లపై దాడులు

22 Feb, 2021 08:02 IST|Sakshi

కుటుంబ ఆర్థిక గణన సర్వేకు అడ్డంకులు వివరాలు అడిగితే సవాలక్ష సందేహాలు 

నగరంలోని పంజాగుట్టలో కుటుంబ ఆర్థిక గణన సర్వే కోసం ఇంటికి వచ్చి వివరాలు అడిగిన ఎన్యూమరేటర్‌కు సమాచారం అందించేందుకు నిరాకరించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇలాంటి ఘటనలు మాస్‌ ఏరియాలో కాకుండా క్లాస్‌ ఏరియాలో ఎదురు కావడం విస్మయానికి గురిచేస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కుటుంబ ఆర్థిక గణన సర్వేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వివరాలు అందించేందుకు కొందరు సవాలక్ష సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దాడులకు సైతం పాల్పడుతున్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు  నగరంలో ఏడో ఆర్థిక గణన సర్వే మూణ్నెల్లుగా కొనసాగుతోంది. ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా సర్వే చేస్తున్నారు. దీని ద్వారా దారిద్యరేఖకు దిగువ, ఎగువ కుటుంబాల తలసరి ఆదాయాల లెక్క తేలనుంది. 
 
11.4 లక్షల కుటుంబాల సర్వే పూర్తి..  
⇔ నగరంలో  ఇప్పటి వరకు సుమారు 11.4 లక్షల కుటుంబాల గణన పూర్తయ్యింది. అందులో 10,28,462 నివాస గృహాలు, 64,694 వాణిజ్య దుకాణాలు, 10,917 ఇతరత్రా సముదాయాల సర్వే పూర్తయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
⇔ హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సుమారు 15 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసిన అధికారులు ఆర్థిక గణన సర్వే కోసం సుమారు 1,394 ఎన్యూమరేటర్లను రంగంలోకి దింపారు. 196 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో మొత్తం 266 యూనిట్లుగా విభజించగా ఇప్పటి వరకు 134 యూనిట్లు పూర్తి చేశారు. మార్చి 31నాటికి సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. 
 
30 అంశాలపై .. 
⇔ నగరంలో కుటుంబ ఆర్థిక గణన సుమారు 30 అంశాలపై కొనసాగుతోంది. ప్రతి కుటుంబం జీవనశైలి, నివాసాలు, ఆర్థిక వనరులు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా సర్వే చేస్తున్నారు. ప్రతి కుటుంబంనుంచి సేకరించిన వివరాలను అక్కడికక్కడే ఎన్యూమరేటర్‌ మొబైల్‌ యాప్‌లో పొందుపరుస్తున్నారు.  
⇔ ఎన్యూమరేటర్లకు జియో ట్యాగింగ్, టైమ్‌ స్టాంపింగ్, యాప్‌ లెవల్‌ డేటా  ధ్రువీకరణ, డేటాను సంరక్షించేందుకు సురక్షితం కోసం లాగిన్,వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదికలను పైస్థాయి అధికారులకు అప్‌లోడ్‌ చేసేలా సులభతరంగా వీటిని రూపొందించారు.  
⇔ సర్వే రెండు రకాలుగా ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ఇల్లు తీరును పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇంటి ముందు దుకాణాలు ఉన్నా, ఇంటి ముందు కమర్షియల్‌ గదులు ఉన్నా, మొత్తంగా కమర్షియల్‌ దుకాణాలు ఉన్నా వివిధ విభాగాల కింద వివరాలను సేకరించి నమోదు చేస్తారు.  
⇔ నార్మల్‌ హౌస్‌హోల్డ్, సెమీ నార్మల్‌ హౌస్‌హోల్డ్, కమర్షియల్‌ విభాగాల కింద సర్వే వివరాలను నమోదు చేస్తారు. ఆర్థిక గణన కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి చెందిన కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ ద్వారా సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్‌ జిల్లా మేనేజర్లు శివారెడ్డి, గౌతం ఈ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. 

సర్వేకు సహకరించండి..   
కుటుంబ ఆర్థిక గణన సర్వేకు సహకరించాలి. భవిష్యత్తులో బహుళ ప్రయోజనకారిగా ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలు వెల్లడిస్తే సరిపోతుంది. ఇబ్బందేమీ ఉండదు.  - డాక్టర్‌ ఎన్‌.సురేందర్, జిల్లా ప్రణాళిక అధికారి  

మరిన్ని వార్తలు