First Gay Marriage In Telangana: తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్‌

20 Dec, 2021 04:43 IST|Sakshi

8 ఏళ్లుగా ప్రేమలో అభయ్, సుప్రియో

ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి

సంగీత్‌ వగైరాలతో సందడిగా..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తొలి ‘గే’ వివాహం జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న అభయ్‌ డాంగ్, సుప్రియో చక్రవర్తి.. తమ కుటుంబ సభ్యులను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. దేశంలో స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత లేకున్నా తమలా సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్నివ్వడానికే ఇలా చేశామని చెప్పారు.

డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమై..
ఢిల్లీకి చెందిన అభయ్‌ డాంగ్‌ (34) హైదరాబాద్‌లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన సుప్రియో చక్రవర్తి (31) కూడా నగరంలోనే ఈ కామర్స్‌ సంస్థ ఉద్యోగి. వీరిద్దరూ 8 సంవత్సరాల క్రితం ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా కలిసి రోజంతా కలిసి మాట్లాడుకున్నారు. కలిసి బ్రతుకుదాం అని నిర్ణయించుకున్నా తమ ప్రేమను బహిర్గతం చేయలేకపోయారు. నాలుగేళ్లుగా గచ్చిబౌలిలో గుట్టుగా సహజీవనం చేస్తున్నారు.

పేరెంట్స్‌ కూడా అలా‘గే’ అన్నాక..
‘ఓ ఫైన్‌ మార్నింగ్‌.. ఎందుకిలా ఎవరికి చెప్పకుండా బ్రతకాలి?’ అని ఇద్దరూ ప్రశ్నించుకున్నారు. వీళ్లు కోరుకోవడంతో గత ఫిబ్రవరి 14న ఈ ప్రేమ వ్యవహారం ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది. తదనంతర పరిణామాలతో ‘మేమిద్దరం కలిసి బ్రతుకుతాం’ అని పేరెంట్స్‌కి తేల్చి చెప్పేశారు. తొలుత ఇరువైపుల పెద్దవాళ్లు షాక్‌ తిన్నా ఆ తర్వాత వీళ్లు వివరంగా చెప్పాక ఓకే అన్నారు. ఇక అడ్డేముంది? పెళ్లి బాజాలు మోగాయి. 

పెళ్లి జరి‘గే’..
హైదరాబాద్‌ శంకరపల్లిలోని ఓ రిసార్ట్‌ వీరి పెళ్లికి వేదికైంది. సంగీత్‌ వగైరా వేడుకలన్నీ భాగమైన ఈ రెండు రోజుల పెళ్లికి సిటీకి చెందిన మరో ‘గే’ సోఫియా డేవిడ్‌ పురోహిత పాత్ర పోషించారు. దాదాపు 60 మంది దాకా హాజరైన అతిథులందరికీ చక్కటి వెజిటేరియన్‌ విందు వడ్డించారు. పూర్తిగా వైట్‌ థీమ్‌తో జరిగిన పెళ్లి కావడంతో ఇద్దరూ వైట్‌ కోట్స్‌ ధరించారు. 

చట్టం గుర్తించకున్నా త‘గ్గే’దేలే..
‘మా ప్రేమ స్వచ్ఛమైనది. పెళ్లి ద్వారా మేం ఒక్కటవడం మాత్రమే కాదు.. మాలా సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్ని అందించడమే లక్ష్యం’’ అంటున్నారు ఈ గే జంట. ‘మరి పిల్లలో’.. అని అడిగిన వాళ్లకు ‘కాజు’ను చూపిస్తున్నారు. కాజు ఎవరో కాదు.. కొన్నేళ్లుగా వీళ్లతో పాటు జీవిస్తోన్న పెట్‌ డాగ్‌. ‘కాజు మా దత్త పుత్రుడు’ అని మురిపెంగా అంటున్నారు.  

మరిన్ని వార్తలు