ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్షలో 87 శాతం మంది ఫెయిల్‌

26 Aug, 2023 02:30 IST|Sakshi

ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 13 శాతమే పాస్‌

విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినవారికి ఇండియాలో నిర్వహించే పరీక్ష ఇది

దేశవ్యాప్తంగా 24,269 మంది పరీక్ష రాయగా కేవలం 3,089 మందే పాస్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్ష (ఎఫ్‌ఎంజీఈ) పాసవడం కష్టతరంగా మారింది. ఇటీవల జరిగిన ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 13 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్లు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్‌బీఈ) ప్రకటించింది. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదువుపై విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన వైద్య విద్య ఆయా దేశాల్లో ఉండటం లేదన్న ఆరోపణలకు ఈ ఫలితాలు నిదర్శనంగా చెబుతున్నారు.

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మన దేశంలో ప్రాక్టీస్‌ చేసేందుకు, లైసెన్స్‌ పొందడానికి, మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌కు, పీజీ మెడికల్‌ చదవడానికి ఎఫ్‌ఎంజీఈ పాస్‌ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు ఆ నాలుగేళ్లలో 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినవారు హాజరుకాగా, 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే ఆ నాలుగేళ్లలో కేవలం 14.22 శాతమే పాస్‌ అయ్యారు.

ఈ ఏడాది అది మరింత తక్కువగా ఉండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జూలైలో 24,269 మంది ఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాయగా, కేవలం 3,089 మందే పాసయ్యారు. మిగిలిన 21,180 మంది ఫెయిల్‌ అయ్యారు. అంటే ఏకంగా 87 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. చైనా, రష్యాలకు ఎక్కువగా వెళుతుండగా, ఆయా దేశాల్లో చదివినవారిలో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ విద్యార్థి ఈ ఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు మాత్రమే అవకాశముంటుంది.

కొన్ని దేశాలు, కొన్ని కాలేజీల్లో నాసిరకమైన వైద్య విద్య ఉండటం, మన దేశంలోని వైద్య విద్యకు సమాన స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. పైగా చైనా, రష్యాల్లో ఆయా దేశ భాషలోనే వైద్య విద్య నేర్చుకుంటారు. ఇక్కడకు వచ్చాక ఎఫ్‌ఎంజీఈ పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. దీనివల్ల చాలామంది ఫెయిల్‌ అవుతున్నారు. పైగా ఎఫ్‌ఎంజీఈ పూర్తిగా థియరీగా ఉండటం వల్ల కూడా ఫెయిల్‌ అవుతున్నట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకేల్లో ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన వైద్య విద్య పూర్తి చేసినవారికి మన దేశంలో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాయాల్సిన అవసరంలేదు. .

ఎక్కువ ఫీజుతో విదేశాలకు
దేశంలో ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ని పెరుగుతున్నా, డిమాండ్‌కు తగినంతగా సీట్లు లేకపోవడంతో అనేకమంది విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20.38 లక్షల మందికి విద్యార్థులు నీట్‌ పరీక్ష రాయగా, అందులో 11.45 లక్షల మంది అర్హత సాధించారు. కానీ మన దేశంలో కేవలం 1.08 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లే ఉన్నాయి.దీంతో మన దేశంలో సీటు రానివారు, విదేశాల్లో ఎంబీబీఎస్‌ కోసం వెళ్తుంటారు.

మరికొందరు మన దేశంలోనే ఎండీఎస్‌ లేదా ఆయుష్‌ కోర్సులు చేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. కాగా, తెలంగాణ నుంచి ఈ ఏడాది 72,842 మంది నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. అందులో 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇంకా చాలామంది సీటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు ఎక్కువగా ఉంటాయి. కోర్సు పూర్తి చేయాలంటే బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ సీటు ఫీజు రూ. 23.10 లక్షల వరకు ఉంటుంది.

ఆయా దేశాల్లో ఫీజు తక్కువే కానీ..
అదే విదేశాల్లో చదివితే దేశాన్ని బట్టి ఎంబీబీఎస్‌ కోర్సు మొత్తం పూర్తి చేసేందుకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల ఫీజు మాత్రమే ఉంటుంది. దీంతో చాలామంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, పిలిఫ్పైన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా తదితర దేశాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. 

మరిన్ని వార్తలు